Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. తలకు హెల్మెట్‌ పెట్టుకొని వచ్చి చోరీకి పాల్పడిన నిందితుడు..

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఘటన చోటు చేసుకుంది. అందులోని సుధర్మ భవన్‌లో నాలుగు హార్డ్ డిస్క్ లు చోరీ జరిగినట్లు..

Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. తలకు హెల్మెట్‌ పెట్టుకొని వచ్చి చోరీకి పాల్పడిన నిందితుడు..

Telangana Raj Bhavan

Updated On : May 20, 2025 / 8:50 AM IST

Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోని సుధర్మ భవన్‌లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ జరిగినట్లు సీసీ పుటేజ్ ల ద్వారా సిబ్బంది గుర్తించారు. మొదటి అంతస్తులోని గది నుంచి హార్డ్ డిస్క్‌లు అపహరణకు గురయ్యాయి. ఈనెల 14న రాత్రి ఈ చోరీ జరిగింది.

 

చోరీ జరిగిన విషయాన్ని రాజ్ భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్ లను పరిశీలించగా.. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూంలోకి వెళ్లిన వ్యక్తి.. హార్డ్ డిస్క్‌లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ హార్డ్ డిస్క్‌లలో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలక సమాచారం, ఫైల్స్ ఉన్నట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు.

 

పంజాగుట్ట పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించగా.. చోరీ చేసిన నిందితుడ్నిగుర్తించారు. రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చోరీచేసిన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం హై సెక్యూరిటీతో, సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్ భవన్ లో చోరీ జరగడం సంచలనంగా మారింది.