Komaram bheem: ఆసిఫాబాద్ జిల్లాలో మరో వ్యక్తిపై పులి దాడి.. పరిసర గ్రామాల్లో హైఅలర్ట్

: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే శనివారం మరో వ్యక్తిపై పులి దాడి చేసింది.

Komaram bheem: ఆసిఫాబాద్ జిల్లాలో మరో వ్యక్తిపై పులి దాడి.. పరిసర గ్రామాల్లో హైఅలర్ట్

Updated On : November 30, 2024 / 2:21 PM IST

Tiger Attacks: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే శనివారం మరో వ్యక్తిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టి) మండలం దుబ్బగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయాన్నే పొలంలో పనినిమిత్తం వెళ్లిన సురేశ్ అనే రైతుపై పులి దాడి చేసింది. అదే సమయంలో అక్కడి సమీపంలోఉన్న వ్యక్తులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పులి పారిపోయింది. దీంతో పులి దాడిలో గాయపడిన సురేశ్ ను ఆస్పత్రికి తరలించారు. పులి వరుస దాడులతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Also Read: Varanasi Railway Station: భారీ అగ్నిప్రమాదం.. పార్కింగ్ చేసిన 200 వాహనాలు దగ్దం.. ఎలా జరిగిందంటే?

కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ (21) అనే మహిళపై పులి దాడి చేయడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. నజ్రుల్ నగర్ గ్రామ శివారులోని పొలంలో పత్తి ఏరేందుకు వెళ్లగా పులి దాడిచేసి నోటకరచుకొని వెళ్లింది. తీవ్ర గాయాలతో పడిఉన్న మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె కన్ను మూసింది. ఈ ఘటన మరువకముందే శనివారం ఉదయం పొలంకు వెళ్లిన రైతుపై పులి దాడి చేయడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటునుంచి పులి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిజాడ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్ సాయంతో గాలిస్తున్నారు.

 

కాగజ్ నగర్ మండంలలోని పలు గ్రామాల్లో అధికారులు ఆంక్షలు విధించా. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలకు పొలాలకు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. దాడి చేసిన చోటకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని పరిసర గ్రామాల ప్రజలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పులిని వీలైనంత త్వరగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.