Tiger Tension : బాబోయ్ పులి.. రోడ్డుకు అడ్డంగా వచ్చిన పెద్దపులి.. హడలిపోయిన వాహనదారులు..

అటు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.

Tiger Tension : బాబోయ్ పులి.. రోడ్డుకు అడ్డంగా వచ్చిన పెద్దపులి.. హడలిపోయిన వాహనదారులు..

Updated On : November 12, 2024 / 6:09 PM IST

Tiger Tension : నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న అర్థరాత్రి మహబూబ్ ఘాట్స్ వద్ద వాహనదారులకు రోడ్డుకు అడ్డంగా వచ్చింది పెద్ద పులి. ప్రస్తుతం పులి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత 10 రోజులగా బోథ్, కుంటాల మండలాల సమీప గ్రామాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేస్తోంది పులి. అయితే, ప్రస్తుతం ఈ పులి తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో అదే ప్రాంతం వైపు అడుగులు వేస్తోంది పులి.

పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ట్రాక్ చేసి పెద్దపులిని త్వరగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. పులి సంచారంతో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని వాపోయారు. చేతికి అందివచ్చిన పంట పొలాలను కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులిని బంధించేందుకు బోన్లు సైతం చేశారు. పెద్దపులిని పట్టుకునేంత వరకు స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా గజగజ వణికిపోయే పరిస్థితి ఉంది. నిన్న అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున నిర్మల్-ఆదిలాబాద్ జిల్లాల బోర్డర్ లో పెద్దపులి సంచరిస్తూ వాహనదారులకు కనిపించింది. పాత జాతీయ రహదారి మహబూబ్ ఘాట్స్ లో పెద్దపులి రోడ్ క్రాస్ చేస్తుండగా కొంతమంది వాహనదారులు దాన్ని వీడియో తీశారు. ఆ పులి ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు సమాచారం.

అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాక్ కెమెరాలు, బోన్లు రెడీ చేశారు. పులి ఫుట్ మార్క్స్ ఆధారంగా అది ఎటువైపు పోతుంది అన్న దాని ఆధారంగా అవతలివైపు గ్రామాల ప్రజలు, వ్యవసాయదారులు, రైతులను అటవీశాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. మహబూబ్ ఘాట్స్ కు సంబంధించిన ప్రాంతం గుట్ట, అటవీ ప్రాంతం. పులి సంచారంతో పశువుల కాపరులు కానీ, గొర్రెల కాపరులు కానీ, రైతులు కానీ.. ఇటువైపుగా రాని పరిస్థితి ఉంది.

గత కొన్నేళ్లుగా పులుల సంచారం పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నుంచి సమ్మర్ వరకు పులులన్నీ ఆ ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చి శాశ్వత నివాసం కోసం కొంత ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, పులులకు అనువైన ప్రాంతం కనిపించడం లేదు. శాకాహార జంతువులు అడవిలో లేవు. దానికి తోడు నీటి లభ్యత సమస్యగా మారింది. దాంతో పులులు ఆదిలాబాద్, సిర్పూర్ లో ఉండటానికి మొగ్గు చూపటం లేదు. నివాసం ఏర్పరచుకునే క్రమంలోనే గ్రామాల సమీపాల్లో సంచరిస్తున్నాయి. అడవుల్లో శాకాహార జంతువులు కనిపించక.. పశువులపై దాడికి పాల్పడుతున్నాయి పులులు. కొన్ని చోట్ల మనుషులపైనా కూడా దాడులకు తెగబడుతున్నాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Also Read : అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఆగ్రహం