నేడు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

తెలంగాణలోని పలు చోట్ల నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్ణాటక వరకు మరత్వాడా, మధ్య మహారాష్ట్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి బలహీనంగా మారిందని వెల్లడించారు. అలాగే రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు పడ్డాయి. ఈదురు గాలులు వీచాయి. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది. పగలు ఎండలతో, రాత్రిళ్లు ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు కొంత ఉపశమనం కలిగింది.
రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్, ఖమ్మంలో 40.8, భద్రాచలంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మహబూబ్ నగర్ 40, మెదక్ 39.6, నల్గొండ 39.5, హైదరాబాద్ 38.8, నిజామాబాద్ 38.3, రామగుండం 38.2, హన్మకొండ 37.5 ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.