Traffic Restrictions: రేపు బక్రీద్.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో గురువారం పలు ప్రాంతాల్లో బక్రీద్ సందర్భంగా నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Restrictions: రేపు బక్రీద్.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad traffic Police

Updated On : June 28, 2023 / 2:07 PM IST

Bakrid 2023: హైదరాబాద్‌లో గురువారం పలు ప్రాంతాల్లో బక్రీద్ సందర్భంగా నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు నిర్ణయించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్ పార్కింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నగర సీపీ ఆనంద్ విడుదల చేశారు. గురువారం ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే రూట్లకు మళ్లించనున్నారు. ప్రయాణికులు సహకరించి వారు సూచించిన మార్గాల్లో ప్రయాణం సాగించాలని పోలీసులు కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు ఇవే ..

పురానాపూల్, కమాటిపురా, కిషన్‌బాగ్ నుండి ప్రార్థనల కోసం ఈద్గా, మీర్ ఆలంట్యాంక్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు (నమాజీలు) బహదూర్‌పురా ఎక్స్‌రోడ్ల మీదుగా ఉదయం 8.00 నుండి 11.30 వరకు అనుమతించబడతాయి. సాధారణ వాహనాలు బహదూర్‌పురా ఎక్స్ రోడ్‌ వద్ద కిషన్‌బాగ్, కమాటిపురా, పురానాపూల్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుండి ప్రార్థనలకోసం ఈద్గా, మీర్ ఆలంట్యాంక్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు (నమాజీలు) దనమ్మ హట్స్ ఎక్స్‌రోడ్డు మీదుగా ఉదయం 8.00 నుండి 11.30 వరకు అనుమతించబడతాయి. సాధారణ వాహనాలను దానమ్మ హట్స్ ఎక్స్‌రోడ్డు వద్ద శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట, తదితరాల వైపు మళ్లిస్తారు.

కాలాపతేర్ నుండి ఈద్గా మీర్ ఆలంట్యాంక్ వైపు వచ్చే వాహనాల ట్రాఫిక్ (నమాజీలు) కాలాపతేర్ L&O PS ద్వారా అనుమతించబడుతుంది. అటువైపు వచ్చే సాధారణ వాహనాల రాకపోకలను కాలాపతేర్ L&O PS వద్ద మోచి కాలనీ, బదూర్‌పురా, శంషీర్‌గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు మళ్లించబడతాయి. పురానాపూల్ నుండి బదూర్‌పురా వైపు వచ్చేఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలను పురానాపూల్ దర్వాజా వద్ద నుంచి జియాగూడ, సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. శంషాబాద్, రాజేంద్ర నగర్, మిలార్‌దేవ్‌పల్లి నుండి బదూర్‌పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలను ఆరామఘర్ వైపు మళ్లిస్తారు.