ఉందిలే మంచికాలం.. ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న కొరియర్, పార్సిల్ సర్వీసులు

TSRTC parcel, cargo services: అసలే నష్టాలు.. ఆపై కరోనా కష్టాలు…దీంతో తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇపుడిపుడే రోడ్డెక్కిన బస్సులతో అలా అలా నెట్టుకొస్తున్నారు. దీంతో ఆర్టీసీని లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు తెచ్చిన కొరియర్, పార్శిల్ సర్వీసులపైనే అధికారులు గంపెడాశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ టికేటేతర ఆదాయం ఆర్టీసీకి లాభాలను ఇచ్చేలాగే కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే ఆర్టీసీ డోర్ డెలివరీ:
టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు.. సత్ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ కొరియర్, పార్సిల్ సర్వీసుల ద్వారా సంస్థకు మంచి ఆదాయమే వస్తుంది. కరోనాతో బస్సులు ఎక్కేవారు గణనీయంగా తగ్గారు. దీంతో టికేటేతర ఆదాయంపై దృష్టి సారించిన ఆర్టీసీ.. ప్రారంభించిన కొద్ది కాలంలోనే.. అనుకున్నదాని కంటే ఎక్కువ ఆదాయం రాబడుతోంది. ఇదే ఉత్సాహంతో బస్టాండ్ వరకే పరిమితమైన తమ సేవల్ని..కొద్ది రోజుల్లోనే వినియోగదారుని ఇంటికి వస్తువులను డెలివరీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది.
తెలంగాణ వంటకాలు సప్లయ్:
పార్సిల్, కొరియర్ సేవలు హోం డెలివరీ చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా 587 మంది ఏజెంట్ల నియామకాలు పూర్తి చేశారు. ఇదే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సేవలు విస్తృతం చేసేందుకు ఇంటర్ స్టేట్ కార్గో పార్సిల్ కొరియర్ సర్వీసుల కోసం.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 147 బస్ స్టేషన్లలో ఆర్టీసీ కార్గో కొరియర్ సేవలు కొనసాగుతున్నాయి.
రానున్నది పండుగల సీజన్ కావడంతో..తెలంగాణ వంటకాలను వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్ల ద్వారా సప్లయ్ చేయడానికి స్థానికంగా ఉండే ఏజెంట్లతో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన సరకులను డెలివరీ చేయడంతో పాటు పాఠ్యపుస్తకాలు స్కూల్స్‌కి పంపేందుకు ఒప్పందం కుదిరింది.
రోజుకు 20 లక్షల ఆదాయం ఆర్జించాలని టార్గెట్:
టికేటేతర ఆదాయంపై దృష్టి సాధించిన ఆర్టీసీకి ఉహించినదానికి మించి ఆదాయం వస్తుంది. కొరియర్ సేవలు ప్రారంభమైన మొదటిరోజు ఆదాయం 15వేలు మాత్రమే వచ్చింది. మెల్లమెల్లగా ఒక రోజుకు 5నుంచి 10 లక్షల మధ్య ఆదాయం వస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో బస్సులు నడవడంతో పాటు అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమైతే మరింత ఆదాయం రాబట్టవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ పార్సిల్ కొరియర్ కార్గో ద్వారా రోజుకు 20 లక్షల ఆదాయం ఆర్జించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.