Sai Chand Passed Away: గుర్రంగూడకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. మధ్యాహ్నమే సాయిచంద్ భౌతికకాయానికి అంత్యక్రియలు

సాయిచంద్ భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Sai Chand Passed Away: గుర్రంగూడకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. మధ్యాహ్నమే సాయిచంద్ భౌతికకాయానికి అంత్యక్రియలు

Sai Chand Passed Away,

Updated On : June 29, 2023 / 11:16 AM IST

TSWC Chairman Sai Chand: ప్రముఖ గాయకుడు , తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ (TSWC Chairman) సాయిచంద్(39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి బిజినేపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయిచంద్ చనిపోయినట్లు నిర్ధారించారు.

Saichand Passed Away : తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం

సాయిచంద్ భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. కాగా గుర్రంగూడలోని సాయింద్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు.

సాయిచంద్ మృతి కుటుంబ సభ్యుల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సాయిచంద్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు గుర్రంగూడ వెళ్లి సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సాయిచంద్ చిన్నవయస్సులోనే అకాల మరణం చెందడం ఎంతో బాధగా ఉందని పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కన్నీరు పెట్టుకున్నారు.

సాయిచంద్ వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న జన్మించారు. పీజీ వరకు చదువుకున్న సాయిచంద్ విద్యార్థి దశ నుంచే కళాకారుడు, గాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. 2021 డిసెంబర్ నెలలో సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సాయిచంద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.