టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారు : కిషన్ రెడ్డి

kishanredddy fires trs : టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. దుబ్బాకలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని చెప్పారు. పాలకులు, అధికారులు వ్యవహార శైలిని ప్రజలు పరిశీలిస్తున్నారని తెలిపారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారనడానికి దుబ్బాక తీర్పే ఉదాహరణ అన్నారు.
రాజకీయాలకు అతీతంగా బీజేపీ గెలుపుపై హర్షం వ్యక్తమవుతోందన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపును ఉద్యమకారులు అభినందిస్తున్నారని తెలిపారు. బీజేపీ గెలుపుపై అమరవీరుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా జైలుకు పంపించారని మండిపడ్డారు. ఆ కార్యకర్తలు జైల్లో సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో ఉన్నంత అధికార దుర్వినియోగం ఏ రాష్ట్రంలోనూ కనిపించదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు మామ ఇంటి మీద దాడి చేశారని చెప్పారు. హైదరాబాద్ లోని రఘునందన్ రావు కుటుంబ సభ్యులను వేధించారని తెలిపారు. ఎన్నికల వేళ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ప్రచారానికి వెళ్తే అడుగడుగునా వాహనాలు ఆపి, రోడ్డు పక్కన గంటల తరబడి నిలబెట్టించారని పేర్కొన్నారు.
బీజేపీ వెహికిల్స్ ను సెర్చ్ చేస్తున్నప్పుడు పక్కనుంచే వెళ్తున్న టీఆర్ ఎస్ నేతల వెహికిల్స్ ను ఆపలేదన్నారు. అధికారులు పక్షపాతంగా అధికారులు వ్యవహరించారని తెలిపారు. కొందరు అధికారులు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ శాశ్వతం అనుకుంటున్నారని…అతిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. బీజేపీని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.