రెయిన్ అలర్ట్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రెయిన్ అలర్ట్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

Updated On : June 9, 2025 / 7:00 AM IST

Rain Alert: దేశవ్యాప్తంగా మళ్లీ వాతావరణం మారబోతుంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసిన వివరాల ప్రకారం.. వచ్చే వారం రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోసహా పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మే నెల చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుసైతం కురిశాయి. అయితే, జూన్ నెలలో వారం రోజులుగా మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళ మండేఎండలతోపాటు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తుండగా.. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (సోమవారం) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మంగళవారం సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలతోపాటు భారీ వర్షాలుకూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బుధవారం నాడు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో సోమవారం ఉదయం వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచే వాతావరణం మేఘావృతం అయ్యిఉండటంతోపాటు ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వారం రోజుల పాటు నగరంలో అడపాదడపా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.