Congress: కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన ఎలా ఉంది? ఏమేం చేసింది?

Congress: హామీల అమలుతో పాటు.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవ‌క‌త‌వ‌కలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్.

Congress: కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన ఎలా ఉంది? ఏమేం చేసింది?

CM Revanth Reddy

ప్రజాపాలన ట్యాగ్‌లైన్‌తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వందరోజుల పాలనపై తెలంగాణలో నడుస్తున్న డైలాగ్‌ వార్‌ ఇది.. ఆరు గ్యారెంటీల అమలుతో పాటు.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణతో దూకుడు పెంచింది రేవంత్‌ సారధ్యంలోని కాంగ్రెస్‌ సర్కార్‌.

డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్ ముందున్న కంచె తొలగించడంతోనే తన మార్క్‌ పాలన స్టార్ట్ చేశారు.. ప్రగతిభవన్‌లోకి ప్రజలకు అనుమతి.. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభంతో ప్రజల దృష్టిని ఆకర్షించారు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10లక్షలు ఇచ్చే పథ‌కాల‌కు శ్రీకారం చుట్టారు.

ఆరు గ్యారంటీల‌కు దరఖాస్తులు
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి గ్రామసభల్లో ప్రజల నుంచి ఆరు గ్యారంటీల‌కు దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం.. ఆరు గ్యారంటీల్లో భాగ‌మైన గృహ‌జ్యోతి కింద 200 వంద‌ల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వంద‌ల‌కే గ్యాస్ సిలిండ‌ర్, ఇందిర‌మ్మ ఇళ్ల పథకాల‌ను ప్రారంభించింది రేవంత్ సర్కార్.

హామీల అమలులో భాగంగా ఉద్యోగాలభర్తీపైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.. వివాదాల్లో చిక్కుకున్న TSPSC పాలకవర్గాన్ని మార్చి కొత్త ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో, కొత్త బోర్డు సభ్యులను నియమించింది. టెట్ నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మెగా డీఎస్సీ, గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది..

హామీల అమలుతో పాటు.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవ‌క‌త‌వ‌కలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలసంఘాన్ని కోరింది.

ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల ఇష్యూ, గొర్రెల పంపిణీ పథకంపై విచారణకు ఆదేశించింది. ధరణి పోర్టల్ ఏజెన్సీ, మిషన్ భగీరథ విలేజ్ లెవల్ ఇంట్రా పైపులైన్లు, వాణిజ్య పన్నులశాఖ పరిధిలో వ్యాట్ ఎగవేత వంటి అవినీతి ఆరోపణలపై విచార‌ణ చేప‌ట్టింది రేవంత్ రెడ్డి స‌ర్కార్.

వచ్చిన వందరోజుల్లోనే ఇన్ని చేసి చూపించామని చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని బీఆర్ఎస్..ఇప్పుడు గుడ్డు మీద ఈకలు పీకుతుందని విమర్శిస్తోంది కాంగ్రెస్.

సమాధానం చెప్పాలి: ప్రతిపక్షాలు

కాంగ్రెస్ నేతలకు గద్దెనెక్కడానికి ఉన్న తొందర.. హామీల అమలుకు లేదని అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. వందరోజుల కాంగ్రెస్‌ పాలన మూడు విచారణలు ఆరు వేధింపులుగా సాగిందని విమర్శిస్తున్నారు గులాబీ నేతలు. పార్టీ గేట్లు ఎత్తుతామంటున్న సీఎం రేవంత్‌.. ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతులకు నీళ్లివ్వాలని కౌంటర్‌ ఇచ్చారు మాజీమంత్రి హరీష్ రావు. కేసీఆర్ తెలంగాణ పరువును పెంచేందుకు ప్రయత్నం చేస్తే..రేవంత్ కరువును పెంచుతున్నారని మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శిస్తోంది బీజేపీ. వంద రోజుల డెడ్ లైన్ ముగిసిందని.. సాకులు చెప్పడం మానేసి.. ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. కొత్త రేషన్ కార్డులు..ఇందిరమ్మ ఇళ్లు.. మహిళలకు నెలకు 2500 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్.

వందరోజుల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. మూడునెలల్లోనే మెజార్టీ హామీలు అమలు చేశామని.. భవిష్యత్‌లో మిగతా అన్ని హామీలను పూర్తి చేస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే రేవంత్ సర్కార్ ప్రజల ఆకాంక్షల కంటే వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకెళ్తుందని.. బడే భాయ్.. చోటే భాయ్ ఒక్కటేనని.. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తేనే పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించడం సాధ్యమని చెబుతున్నారు గులాబీ లీడర్లు.

Kavitha Arrest: సుప్రీంకోర్టుకు వెళ్తామన్న హరీశ్ రావు.. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి బీఆర్ఎస్ పిలుపు