కాంగ్రెస్ సర్కార్‌ అందుకే వ్యూహం మార్చుకుందా? ఈ విషయంలో ఏం చేయబోతుంది?

కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన ఏంటి? ఎందుకు ఇలా మార్పులు చేసింది?

కాంగ్రెస్ సర్కార్‌ అందుకే వ్యూహం మార్చుకుందా? ఈ విషయంలో ఏం చేయబోతుంది?

Updated On : February 3, 2025 / 8:09 PM IST

తెలంగాణ గడ్డపై ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్‌ పెడుతూ ఓ స్టెప్‌ తానే ముందుండేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్. అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆల్ ఆఫ్ స‌డెన్‌గా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు.

కుల‌గ‌ణ‌న‌, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని చ‌ర్చించ‌డానికి ఫిబ్రవ‌రి 7న అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించాలనుకుంది ప్రభుత్వం. కానీ అనుకోకుండా మూడ్రోజులు ముందుకు జ‌రిపింది. ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు నోటిఫికేషన్‌ వచ్చేలా అసెంబ్లీలో కొన్ని కీల‌క అంశాల‌పై నిర్ణయం తీసుకోవాల‌ని భావించింది.

కుల‌గ‌ణ‌న రిపోర్టు ఆధారంగా బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశం..అలాగే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ఏక‌స‌భ్య క‌మిష‌న్ ఇచ్చే రిపోర్టుపై కూడా డెసిషన్‌ తీసుకోవాల‌నుకుంది. అందుకోసం ఫిబ్రవ‌రి 5న క్యాబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసి.. ఫిబ్రవ‌రి 7న అసెంబ్లీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ స‌డెన్‌గా ఫిబ్రవ‌రి 4న మంత్రివర్గ స‌మావేశం..అదే రోజు అసెంబ్లీ భేటీ కావాలని ప్రభుత్వం వ్యూహం మార్చింది.

తేదీని మార్చడం వెన‌క పెద్ద స్కెచ్చే?
ప్రభుత్వం ఉన్నట్లుండి క్యాబినెట్‌, అసెంబ్లీ సమావేశాల తేదీని మార్చడం వెన‌క పెద్ద స్కెచ్చే ఉన్నట్లు తెలంగాణ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లుగా అసెంబ్లీ స‌మావేశం జ‌రిగితే.. కాంగ్రెస్ స‌ర్కారు రాజకీయంగా కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని భావించింద‌ట‌. ఎమ్మార్సీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద‌కృష్ణ మాదిగ‌..ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

స‌రిగ్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకున్న ఫిబ్రవ‌రి 7 తేదీన భారీ స‌భకు ప్లాన్ చేశారు మంద‌కృష్ణ. ల‌క్ష డ‌ప్పులతో చాటింపు పేరుతో స‌భ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌ జ‌రిగితే రాజకీయంగా ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వ పెద్దలు భావించార‌ట‌. అందుకే రెండు రోజుల క్రితం క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో మంత్రుల‌తో జ‌రిగిన సుదీర్ఘ భేటీలో ఈ అంశంపై చ‌ర్చించార‌ట‌. మంద‌కృష్ణ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు స‌ర్కార్‌ ప్రతివ్యూహం ర‌చించింద‌ట‌.

అందులో భాగంగానే ఆగ‌మేఘాల మీద క్యాబినేట్ స‌బ్ క‌మిటీల‌కు కుల‌గ‌ణ‌న రిపోర్టు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఏక‌స‌భ్య క‌మిష‌న్ రిపోర్ట్ అందిందట. క్యాబినెట్‌ స‌బ్‌క‌మిటీకి ఇలా రిపోర్టులు అందాయో లేదో..ఒక్కరోజు గ్యాప్‌లోనే అసెంబ్లీ స‌మావేశం నిర్వహించాల‌ని నిర్ణయించింది. అసెంబ్లీ స‌మావేశం..మంత్రివర్గ భేటీ రెండూ ఒకే రోజు నిర్వహించి.. ప్రత్యర్థుల ఎత్తుల‌ను చిత్తు చేయాల‌నుకుంటున్నారట.

అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో క్యాబినెట్ భేటీ

అందుకే ఫిబ్రవ‌రి 4న ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో క్యాబినెట్ భేటీ అవుతుంది. కుల‌గ‌ణ‌న రిపోర్టుతో పాటు..ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ రిపోర్టుల‌ను మంత్రివర్గం ఆమోదించ‌నుంది. క్యాబినెట్‌ ఆమోదముద్ర త‌ర్వాత గంట వ్యవ‌ధిలోనే అసెంబ్లీ స‌మావేశం జరగనుంది. అసెంబ్లీలో ఈ రెండు అంశాల‌పై చ‌ర్చించి..సభ ఆమోదం పొందాల‌ని చూస్తోంది. దీంతో పొలిటిక‌ల్ మైలేజ్ సాధించ‌డంతో పాటు ప్రత్యర్థుల ఎత్తుల‌ను చిత్తు చేయొచ్చనే భావ‌న‌లో రేవంత్ సర్కార్ ఉంద‌ట‌.

మరోవైపు తమ లక్ష డప్పుల చాటింపు సభకు పర్మిషన్ ఇవ్వడం లేదంటూ మండిపడుతోంది ఎమ్మార్పీఎస్. కాంగ్రెస్ పార్టీకో న్యాయం తమకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు మందకృష్ణ మాదిగ. అనుమతివ్వడం ఇష్టం లేకే ప్రభుత్వం కుంటిసాకులు చెప్తుందని మండిపడుతున్నారు.

ఇలా లక్ష డప్పుల చాటింపు సభకు ముందే అసెంబ్లీలో వర్గీకరణ రిపోర్టుకు ఆమోదం తెలపాలని సర్కార్ ప్లాన్ చేస్తుంటే..తమ సభను సాంస్కృతిక కార్యక్రమంగానే మాత్రమే చూడాలని ఎమ్మార్పీఎస్ అంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము సభ నిర్వహించడం లేదంటోంది. ఇలా ఎత్తుల‌కు పైఎత్తు వ్యూహాలు నడుస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఎవ‌రు పై చేయి సాధిస్తార‌నేది చూడాలి మరి.