హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?

ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్‌లో పెద్దగా మార్పులు రావడం లేదంటున్నారు రియల్టర్లు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?

CM Revanth Reddy

Updated On : October 26, 2024 / 9:10 PM IST

హైదరాబాద్‌లో హైడ్రా పేరెత్తితేనే హడల్ ఎత్తిపోతున్నారు రియల్టర్లు, బిల్డర్లు. రిజిస్త్రేషన్ల ఆదాయం దారుణంగా పడిపోయింది. హైడ్రా ఎఫెక్టుతో పాటు, నిర్మాణ రంగంపై ప్రభుత్వ పాలసీ ప్రకటించకపోవడంతో రియల్ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్పై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. హైడ్రా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కొత్త వెంచర్లు వేసినా ఎవరూ కొనడం లేదట.

నిర్మాణాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రస్తుతానికి ఇక్కడ తమ ప్రాజెక్టులను ఆపేసి..అమరావతి-బెంగళూరులో లాంచ్ చేస్తున్నాయట. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తెచ్చినా.. కూల్చివేతలలో దూకుడు ఎక్కువ కావడంతో అంతా హడలిపోయారు.

చెరువులు సర్వే చేయకుండానే, FTL, బఫర్ జోన్లపై క్లారిటీ ఇవ్వకుండానే కూల్చేవేస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో అనుమతులు ఉన్నప్పటికీ హైడ్రా దూకుడుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలో పడ్డారట. గతంలో లేక్ వ్యూ అంటే చాలు ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలు జోరుగా సాగేవి… మంచి వ్యూ ఉంటుందనే ఉద్దేశంలో బిల్డర్లు, కొనుగోలుదారులు లేక్ వ్యూ నిర్మాణాలపై ఆసక్తిచూపేవారు.

హైడ్రా వచ్చాక నెలకు 1500 ఇళ్ల అమ్మకాలే..
అయితే హైడ్రా వచ్చాకు లేక్ అనే పదం వింటేనే అటు రియల్టర్లు, ఇటు కస్టమర్లు కూడా ఆమడదూరం పరుగెడుతున్నారట. ప్రతి నెలా సిటీలో దాదాపు 2 వేల ఇళ్ల అమ్మకాలు జరిగేవని తెలుస్తోంది. హైడ్రా వచ్చాక నెలకు 1500 ఇళ్లు కూడా అమ్మడం లేదని బిల్డర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టడం కష్టమేనంటున్నాయి కన్ స్త్రక్షన్ కంపెనీలు.

రియల్ ఎస్టేట్పై ప్రభుత్వ వైఖరి తెలియక బిల్డర్లు అయోమయంలో పడిపోయారని తెలుస్తోంది. నిర్మాణ రంగంపై కూడా సర్కార్ స్పష్టమైన పాలసీని ప్రకటించలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆ మధ్య క్రెడాయ్ ఈవెంట్కు హాజరైనా రియల్ ఎస్టేట్పై తమ వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వలేదు. ఒకసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రేటర్ నిర్మాణ సంస్థలు, రియల్టర్లతో సమావేశం నిర్వహించడమే తప్ప ఎలాంటి క్లారిటీ , భరోసా ఇవ్వలేకపోయారు. దీనికి తోడు నిర్మాణాల అనుమతుల విషయంలోనూ సర్కార్ కొర్రీలతో ఆలస్యం అవుతుందని చెబుతున్నారు రియల్టర్లు.

ఇక హైడ్రా ఎఫెక్ట్తో ఇప్పటికే చెరువుల దగ్గరలో ఉన్న నిర్మాణాల్లో ఎవ్వరూ ఇల్లు కొనుక్కోవడానికి ముందుకు రావడం లేదు. అందుకే కొన్నాళ్ల పాటు హైదరాబాద్లో నిర్మాణ ప్రాజెక్టులను నిలిపేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చాయట నిర్మాణ సంస్థలు. అంతవరకు అమరావతి, బెంగళూరులో నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. రెండు నెలలుగా హైదరాబాద్లో దాదాపు 40 నుంచి 60 వరకు భారీ నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులు నిలిచిపోయాయని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి.

రేవంత్‌ భరోసానిచ్చే ప్రయత్నం

ఈ డ్యామేజ్ ను గమనించిన సీఎం రేవంత్..ఓ అప్పీల్ చేశారు. రియల్ వ్యాపారులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసిన వారికి మాత్రమే హైడ్రా ఓ భూతంలాంటిదని క్లారిటీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకు, ప్రభుత్వ ఆర్థిక మూలాలను ప్రశ్నార్థకం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

రేవంత్ ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రెస్మీట్ పెట్టారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఎలాంటి భయాందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉంటే వారి జోలికి రామని చెప్పారు.

ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్‌లో పెద్దగా మార్పులు రావడం లేదంటున్నారు రియల్టర్లు. EMIలు పెట్టుకుని కొనుక్కున్న వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేయడంతో జనాల్లో కూడా భయం ఉందని..అందుకే ఇండ్ల అమ్మకాలు పడిపోయాయని అంటున్నారు బిల్డర్లు. ప్రస్తుత గందరగోళ పరిస్థితిపై ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇస్తే తప్ప..ఇంకా కొన్నాళ్లు రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇలానే ఉండే అవకాశం ఉందంటున్నారు.

సరస్వతి భూములపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు..