సెలెబ్రిటీకో న్యాయం, సామాన్యుడికో న్యాయమా? జర్నలిస్ట్ పై దాడి జరిగితే రాజకీయ నేతల మౌనం ఎందుకు?
తెలంగాణ ఏ చిన్న ఘటన జరిగినా.. వరుస పెట్టి మాట్లాడే రాజకీయ నాయకులు జర్నలిస్ట్ పై దాడి ఘటనపై మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.

Mohan Babu Attack On Journalist : కెమెరా ముందు కనిపించకపోతే నిమిషం గడవదు. ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏదో లోటుగా ఫీల్ అవుతారు. మీడియాలో తమ బైట్ రాకపోతే తెగ ఫీలైపోతుంటారు. రిపోర్టర్లకు ఫోన్లు చేసి మరీ బతిమిలాడుకుంటారు. అవసరమైతే ఇన్ పుట్ ఎడిటర్లు, ఔట్ పుట్ ఎడిటర్లకు ఫోన్ చేసి తమ ఐటెమ్ కవరేజ్ చేయాలని రిక్వెస్టులు కూడా చేసుకుంటారు. కానీ, ఓ మీడియా ప్రతినిధి మీద దాడి జరిగితే మాత్రం మాకేం తెల్వదు, మేమెక్కడా చూడలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు రాష్ట్రంలో రాజకీయ నేతలు.
నటుడు మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేస్తే స్పందించిన నాధుడే లేడు. కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్ ను అతడి చేతిలోని మైక్ ను లాక్కుని అటాక్ చేశాడు మోహన్ బాబు. ఈ విషయంలో జర్నలిస్టులు రోడ్డెక్కి ఆందోళనలు చేసి జస్టిస్ ఫర్ జర్నలిజం అని గళమెత్తినా.. ప్రభుత్వ పరంగా యాక్షన్ లేదు. పొలిటికల్ లీడర్ల నుంచి రియాక్షన్ లేదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బలహీనవర్గాలకు చెందిన జర్నలిస్ట్ మీద దాడి జరిగితే.. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తప్ప ఎవరూ రియాక్ట్ కాలేదు. తెలంగాణ ఏ చిన్న ఘటన జరిగినా.. వరుస పెట్టి మాట్లాడే రాజకీయ నాయకులు జర్నలిస్ట్ పై దాడి ఘటనపై మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పోటీ పడి మరీ స్పందించారు పొలిటికల్ లీడర్స్. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే.. అన్యాయం అని కొందరు, పోలీసుల వైఖరి సరిగా లేదని ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి రాష్ట్ర మంత్రుల వరకు అందరూ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి.. అల్లు అర్జున్ అరెస్ట్ మీద తమ వెర్షన్ వినిపించారు.
అదే మీడియా ప్రతినిధిపై దాడి విషయంలో మాత్రం.. ఈ లీడర్లు ఎవరూ రియాక్ట్ కాలేదు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మరణిస్తే.. కనీసం ఒక్కరూ రియాక్ట్ అవ్వలేదు. ఎందుకీ వివక్ష అన్నదే ఇక్కడ చర్చ. ఏ లీడర్ మాట్లాడినా ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులు. ఇప్పుడు అల్లు అర్జున్ మీద లీడర్ల రియాక్షన్లు కవర్ చేసింది కూడా జర్నలిస్టులే. అసలు మీడియానే లేకపోతే.. పొలిటికల్ లీడర్లకు ఎలివేషనే దిక్కు లేదు. పొద్దున లేస్తే మీడియాలో కనిపించేందుకు ఆత్రుత పడే నేతలు.. ఓ మీడియా ప్రతినిధి మీద దాడి జరిగితే ఎందుకు గమ్మున ఉండిపోతున్నారు? సినిమా వాళ్లంటే ప్రేమ ఎందుకు? జర్నలిస్టులంటే కోపం ఎందుకు? ఓ జర్నలిస్టుకు ఎదురైన పరిస్థితి ఏ లీడర్ కైనా వస్తే.. ఇలాగే సైలెంట్ గా ఉంటారా? ధర్నాలు, రాస్తారోకోల్లో పోలీసులు గట్టిగా పక్కకు లాగేస్తేనే ఓవరాక్షన్ చేసే నాయకులు.. జర్నలిస్ట్ పై దాడి జరిగితే మాత్రం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
Also Read : అల్లు అర్జున్ ఏమీ తీవ్రవాది కాదు..! అరెస్ట్ వ్యవహారంపై ప్రొ.నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు