KCR: గులాబీ దళపతి రాకకు సమయం ఆసన్నమైందా?
కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుందనడంలో డౌట్ లేదు. అయితే ఆయన రాకపై, బీఆర్‌ఎస్ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు.

తెలంగాణ పొలిటికల్ పిక్చర్ మారుతోంది. ఏడాది పాలనపై కాంగ్రెస్ జోష్ మీదుంటే.. పోరుబాటుతో గులాబీ పార్టీ ఊపు మీదుంది. తగ్గేదేలే అంటూ..ఎందాకైనా రెడీ అంటోంది. అటు కాంగ్రెస్ మాత్రం కలసి రండి..సలహాలు సూచనలు ఇవ్వండి..ఏడాది సంబురాలకు హాజరవ్వండి అంటూ ఆహ్వానిస్తోంది. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌తో పాటు గులాబీ నేతలను ఇన్వైట్ చేస్తోంది కాంగ్రెస్.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సలహాలు సూచనలు కోరుతున్నారు. అయితే వారం రోజుల కింద ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ..అసెంబ్లీకి రమ్మంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్. దీంతో తెలంగాణ పొలిటికల్ సినారియో గమ్మత్తుగా మారింది. కాంగ్రెస్ స్ట్రాటజీ మార్చి విమర్శలు చేస్తూ దూకుడుకు బదులుగా..బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ ఇన్విటేషన్ గులాబీ దళం లైట్ తీసుకుంటోంది. ఓ వైపు రెచ్చగొట్టకుంటూ.. ఇంకోవైపు సలహాలు సూచనలు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండి పడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మొన్నటి వరకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్..ఇప్పుడు టోన్ మార్చి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని అటాక్ చేస్తున్నారు.
కేసీఆర్‌ను అసెంబ్లీకి పిలిచి అవమానించాలనేది రేవంత్, కాంగ్రెస్ నేతల కుట్ర అని అభిప్రాయపడుతోంది గులాబీ పార్టీ. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పిలవడం కూడా రాజకీయ కోణమే తప్ప..రాష్ట్రాన్ని సాధించిన నేతకు గౌరవం ఇవ్వడం లేదని.. అలాంటప్పుడు కాంగ్రెస్ కార్యక్రమాలకు తామెందుకు హాజరవుతామని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం, కేసీఆర్ రాయించిన తెలంగాణ గీతం, రాష్ట్ర చిహ్నం మార్చి..రేవంత్ సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్.
కాంగ్రెస్ నేతలు ఆహ్వానం..సవాల్ ఎలా ఉన్నా..కేసీఆర్ మాత్రం జనవరి 15 తర్వాత ..సంక్రాంతి పీడ దినాలు అయిపోయాక ఫీల్డ్‌లోకి దిగాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని భావించిన గులాబీ బాస్..జనవరి నుంచి ఫుల్ టైమ్ పబ్లిక్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కాంగ్రెస్ వైఫల్యాల మీద సమరభేరి పూరించబోతున్నారట. రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్స్‌పై భారీ బహిరంగ సభ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. అందుకు జనవరి 15 తర్వాత ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారట గులాబీ దళపతి.
లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది!
కేటీఆర్, హరీశ్‌రావు..ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్ యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ, కేసీఆర్ పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని..అటు ప్రజలు, ఇటు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత..మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న వేళ.. కేసీఆర్ రాక గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ బడ్జెట్ సెషన్ తొలిరోజు సభకు వచ్చిన కేసీఆర్, మీడియా పాయింట్ దగ్గర, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆ తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ, ప్రెస్‌మీట్లు గాని పెట్టలేదు. నేతలు, కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్న కేసీఆర్ ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా.? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా.? అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఆ మధ్య మీడియా ప్రశ్నలకు సమాధానంగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయగర్జన చూడబోతున్నారంటూ చెప్పారు కేసీఆర్.
ఆ లెక్కను సార్ సభకు వెళ్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుందనడంలో డౌట్ లేదు. అయితే ఆయన రాకపై, బీఆర్‌ఎస్ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు. అసెంబ్లీ సెషన్ పూర్తి షెడ్యూల్ వచ్చాక కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైనా, ఆయనకు తగినప్రాధాన్యత ఉంటుందా? సభలో కేసీఆర్‌కు మైకు ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తే ఎలా? అనే అంశాలపై కూడా గులాబీ పార్టీ చర్చించుకుంటోంది. ఏదేమైనా, అధినేత ఆగమనానికి సమయం ఆసన్నమైందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా తెలుస్తోంది. చూడాలి మరి గులాబీ బాస్ నిర్ణయం ఎలా ఉండబోతోందో?
అందరి కంటే ముందే వైసీపీని వీడిన ఆళ్లనాని.. ఇప్పుడు సైకిల్ సవారీకి రెడీ.. లోకల్ లీడర్ల అబ్జక్షన్