అందరి కంటే ముందే వైసీపీని వీడిన ఆళ్లనాని.. ఇప్పుడు సైకిల్ సవారీకి రెడీ.. లోకల్ లీడర్ల అబ్జక్షన్
లోకల్ లీడర్ల అభ్యంతరాలతో చంద్రబాబు కాస్త పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు.

Alla Nani
పవర్ పోయింది. ఫ్యాన్ పార్టీ నుంచి జంపింగ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందరి కంటే ముందే వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆళ్లనాని ఇప్పుడు పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్లాన్ చేస్తున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆళ్లనానిని జాయిన్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు టాక్. కాకపోతే లోకల్ లీడర్లు, స్థానిక ఎమ్మెల్యే..ఆళ్లనాని రాకను అడ్డుకుంటున్నారట. గత ఐదేళ్లలో అధికారంలో ఉండి..ఆయన పెట్టిన బాధలు అన్నీఇన్నీ కావని..తమను హింసించిన నేతను ఎలా తీసుకుంటారంటూ అధిష్టానం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయనతో కలిసి పనిచేయడం కష్టమని చెబుతున్నారట.
ఆళ్లనాని టీడీపీలో చేరికపై ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చంద్రబాబును కలిసి తన అభిప్రాయం చెప్పినట్లు టాక్. ఆళ్లనానీని పార్టీలో చేర్చుకునే విషయంలో మరోసారి ఆలోచించాలని..నానీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో అక్రమ కేసులు పెట్టి టీడీపీ శ్రేణులను వేధించారని..వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని..చంద్రబాబుకు వివరించినట్లు చెబుతున్నారు.
ఈ విషయాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం?
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్లనాని.. టీడీపీ కార్యకర్తల ఇళ్లను సైతం కూలగొట్టించిన ఘటనలు ఉన్నాయని, ఆయన పార్టీలోకి రావడం వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని..ఈ విషయంపై పునరాలోచన చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు రాధాకృష్ణ తెలిపారని అంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని బాబు హామీ ఇచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వైనా సహకరించాలని చంద్రబాబు కోరినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మాజీమంత్రి, ఆళ్లనాని టీడీపీలో చేరికపై చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
ఆళ్లనానితో పాటు పలువురు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీమంత్రి శ్రీరంగనాథరాజు పొలిటికల్ యాక్టివ్‌గా లేరు. వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆళ్లనాని, గ్రంధి శ్రీనివాస్ ఇద్దరు కాపు నేతలు. వీళ్లిద్దరికి గోదావరి జిల్లాల్లో మంచి పలుకుబడి ఉన్నట్లు చెబుతున్నారు. వాళ్లను చేర్చుకోవడం ద్వారా పార్టీ మరింత పటిష్టం అవుతుందని భావిస్తున్నారట.
పెండింగ్‌లో పెట్టారా?
అయితే లోకల్ లీడర్ల అభ్యంతరాలతో చంద్రబాబు కాస్త పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు. ఆళ్లనాని చేరిక తర్వాత గ్రంధి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు కూడా పసుపు కండువా కప్పుకోవడం ఖాయమన్న ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా జంపింగ్‌కు సిద్దమయ్యారట. కాకపోతే తానెక్కడికి వెళ్లడం లేదని చెప్తున్నారట. ఇలా నేతలంతా తమ దారి తాము చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే వైసీపీ సగానికి పైగా ఖాళీ అయింది. జిల్లా పరిషత్ ఛైర్మన్‌తో పాటు ఏలూరు మేయర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు సహా చాలా మంది నేతలు టీడీపీలో చేరిపోయారు. ఇంకా ద్వితీయ శ్రేణి నేతలంతా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పార్టీని నడిపించే నాయకులు లేక..క్యాడర్ అయోమయంలో పడిపోయిందట.
ఇలా అయితే తమకు అండగా నిలిచే నాయకులు ఎవరని కార్యకర్తలు మధన పడుతున్నారట. పవర్‌లో ఉన్నప్పుడు అధికారం అనుభవించి..అప్పుడు తమకు న్యాయం చేయని నేతలు..ఇప్పుడు కూడా మళ్లీ తమ స్వార్థం తాము చూసుకుని వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారట. పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టి వెంటనే కొత్త నేతలను ఇంచార్జ్‌లుగా నియమించాలని కోరుతున్నారట. చూడాలి మరి ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది.
ఏడాది పాలనపై సీఎం రేవంత్ సమీక్ష.. రెండో ఏడాదిలో జెట్ స్పీడ్‌తో పరిపాలనకు ప్లాన్