ఆమ్లెట్ కోసం యువతి ఆత్మహత్య

ప్రాణం ఎంతో విలువైంది. కానీ కొందరికి దాని విలువ తెలియడం లేదు. అకారణంగా ప్రాణం తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు, తగాదాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యలక

ఆమ్లెట్ కోసం యువతి ఆత్మహత్య

Updated On : January 21, 2022 / 11:33 AM IST

ప్రాణం ఎంతో విలువైంది. కానీ కొందరికి దాని విలువ తెలియడం లేదు. అకారణంగా ప్రాణం తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు, తగాదాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలిస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. వారి అమాయకత్వంపై జాలి చూపడం మినహా మరేమీ చేయలేము. తాజాగా పెద్దపల్లి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆమ్లెట్ కోసం అక్క కొడుకుతో గొడవపడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

భవాని వేసుకున్న ఆమ్లెట్ లాక్కున్న అక్క కొడుకు:
కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దివ్య భవాని (23) అనే యువతి లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి దగ్గరే ఉంటోంది. స్కూల్‌కు సెలవులు ఉండడంతో ఈమె అక్క కొడుకు కూడా కొద్ది రోజులుగా వీళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. గురువారం(ఏప్రిల్ 23,2020) మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో దివ్య భవాని గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంది. దాన్ని తన అక్కడ కొడుకు లాక్కొని తిన్నాడు. దీంతో ఇరువురి మధ్య చిన్న గొడవ జరిగింది.

భవానిని మందలించిన తండ్రి:
ఇంతలో దివ్య భవాని తండ్రి కలగజేసుకున్నాడు. ఇద్దరినీ మందలించాడు. ఆమ్లెట్ తిన్నందుకే ఆ పిల్లాడిని తిట్టాలా? అంటూ కూతురిపై కోప్పడ్డాడు. తనను తండ్రి మందలించడంతో దివ్య భవాని తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందుతాగింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. దివ్య భవాని మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా జరుగుతుందని భవాని తండ్రి అస్సలు ఊహించలేదు. ఆయన ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఈ విషయం తెలిసి స్థానికులు సైతం విస్తుపోయారు.  ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. ప్రాణం చాలా విలువైనదనే విషయం అందరూ తెలుసుకోవాలని,  ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదని నిపుణులు సూచించారు.