YS Vijayamma : ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ కనిపిస్తారు : విజయమ్మ
పేదలకు అందే ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాశేఖరరెడ్డి మన మధ్యలో భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పనులు ఎప్పుడూ మనతోనే ఉంటాయన్నారు.

Vijayamma
YSR Vardhanthi Sabha : పేదలకు అందే ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాశేఖరరెడ్డి మన మధ్యలో భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పనులు ఎప్పుడూ మనతోనే ఉంటాయన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో వైఎస్‌ఆర్ 12వ వర్ధంతి సంస్మర సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న వైఎస్ విజయమ్మ… ఇది రాజకీయ సమావేశం కాదన్నారు. కేవలం వైఎస్‌ఆర్‌ను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసమే ఈ సభను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అందరూ అండగా నిలిచారని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు విజయమ్మ. మీ అందరికీ నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు తాను బయటకు రాలేదు… ఆ తరువాత రావాల్సి వచ్చిందన్నారు. వైఎస్ ప్రేమ ఆకాశమంత విశాలమైందని తెలిపారు.
వైఎస్ వెళ్లిపోయిన తరువాత తమ బిడ్డల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు ఎక్కడ వెళ్లిన ఓ భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వైఎస్ ను తలుచుకుంటూనే ఉన్నారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, మోడీ అందరూ వైఎస్ సేవలను కొనియాడారని గుర్తు చేశారు. తమ పార్టీ వాళ్లకు తప్ప మరెవరూ చనిపోయినా జెండా దించి సంతాపం తెలుప లేదు.. కానీ వైఎస్ మరణం రోజు జెండా దించి సంతాపం ప్రకటించామని ప్రధాని నరేంద్ర మోడీ తనతో అన్నారని గుర్తు చేశారు. వైఎస్ ఏ ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రాజెక్టులు, స్కూల్స్, ఇలా అన్ని ప్రాంతాలకు పంచారని తెలిపారు. లెక్కలేనన్ని సంక్షేమ పథకాల్లో వైఎస్ కనిపిస్తున్నారని చెప్పారు. వైఎస్ తో ఆయన అభిమానులకు, సహచరులకు ఉన్న అనుబందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
హైటెక్స్‌లో జరిగిన వైఎస్‌ఆర్ వర్ధంతి సభకు పలువురు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సభకు వచ్చిన వారందరినీ విజయమ్మ అప్యాయంగా పలకరించారు. అయితే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణకు చెందిన కీలక నేతలు గైర్హాజరయ్యారు.వైఎస్ విజయమ్మ స్వయంగా ఆహ్వనించినా ఈ వర్ధంతి సభకు రాలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ హాజరుకావొద్దని టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గారు. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం హాజరయ్యారు. టీపీసీసీ ఎవరూ హాజరుకావొద్దని ఆదేశించినా ఆయన హాజరయ్యారు. ఇక ఏపీకి చెందిన కీలక నేతలు సైతం డుమ్మా కొట్టారు. వైసీపీ నేతలెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా వెనుక సీట్లో కూర్చొన్నారు. మాజీ ఎంపీలు గిరీష్ సంఘీ, ఎం.ఏ.ఖాన్, మాజీ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య వర్ధంతి సభకు వచ్చారు. గోనె ప్రకాశరావు, కంతేటి సత్యనారాయణ రాజు, రామ చంద్రమూర్తి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి , సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, బండారు శ్రీనివాస్, జంధ్యాల రవిశంకర్ వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించారు.