YS Sharmila: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం ఎప్పుడు.. వైఎస్ షర్మిల పోటీకి దిగేదెక్కడ?

కాంగ్రెస్‌లో విలీనం తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాత్ర ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసలు షర్మిల-కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి.

YS Sharmila: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం ఎప్పుడు.. వైఎస్ షర్మిల పోటీకి దిగేదెక్కడ?

congress nod to ys sharmila for ysr telangana party merge

YSRTP-  Congress Merge: ఆమె తన డిమాండ్స్ నుంచి వెనక్కి తగ్గాల్సివచ్చింది. ఆయన అడ్డుకోవాలని చూసినా సర్దుకోవాల్సివచ్చింది. చివరికి ఢిల్లీ పెద్దలదే పైచేయి అయ్యింది. ఔను బేషరతుగా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. అదేసమయంలో ఆమె రాకకు బ్రేకులు వేయాలని చూసిన రేవంత్ రెడ్డి కూడా వెనక్కు తగ్గారు. మరోవైపు షర్మిలకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే విలీనానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు హస్తం పార్టీ పెద్దలు. ఇంతకీ కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం ఎప్పుడు.. విలీనమయ్యాక షర్మిల పాత్ర ఏంటి? ఏపీలో చక్రం తిప్పుతారా.. తెలంగాణా బాధ్యతలు చూస్తారా.. ఇంతకీ షర్మిల పోటీకి దిగేదెక్కడ? అసలు తెరవెనుక ఏం జరిగింది?

అంతా అనుకుంటున్నట్లే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం కాబోతోంది.. చాలాకాలంగా చర్చల్లో నలుగుతున్న ఈ ప్రతిపాదన ఒకటి రెండు రోజుల్లోనే కార్యరూపం దాల్చబోతోంది. ఐతే కాంగ్రెస్‌లో విలీనం తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాత్ర ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసలు షర్మిల-కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి.. షర్మిల భవిష్యత్‌పై కాంగ్రెస్ ఎటువంటి హామీ ఇచ్చిందో ఇరుపార్టీలూ బయటకు చెప్పడం లేదు. దీంతో తెలంగాణలో రాజకీయం చేద్దామనుకున్న వైఎస్ఆర్ తనయ ఆశలు నెరవేరేదీ, లేనిదీ సస్పెన్స్ గానే మారింది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. కాబోయే సీఎం తానేనని ప్రకటించిన షర్మిలకు రెండేళ్లకు వాస్తవం బోధపడింది. తెలంగాణాలో ఒంటరిగా రాజకీయం చేయడం తనవల్ల కాదని ఎట్టకేలకు గ్రహించారు వైఎస్ షర్మిల. ప్రస్తుత పరిస్థితుల్లో తన ముందున్న ఆప్షన్స్‌లో ఒకటైన కాంగ్రెస్లో విలీనం చేయడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారామె. అనుకున్నదే తడవుగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రాయబారంతో కాంగ్రెస్ పార్టీ తలుపుతట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ విలీనంపై చర్చించారు షర్మిల. జూన్లో మొదలైన ఈ చర్చలు నాలుగు నెలలు కావస్తున్నా.. ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటు తెలంగాణ.. అటు ఏపీ కాంగ్రెస్ నేతలు షర్మిల చేరికపై విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం షర్మిల పార్టీ విలీనాన్ని పెండింగ్లో పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో గత నెల 30లోగా ఏదో విషయం తేల్చాలని కాంగ్రెస్ అధిష్టానానికి డెడ్‌లైన్ పెట్టారు షర్మిల. కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పందన రాకపోతే.. ఒంటరిగా అయినా తెలంగాణ బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు.

Also Read: బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎందుకొచ్చారు.. ఎందుకు వెళ్లిపోతున్నారు?

తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాకను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షర్మిల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప , లాభం లేదనేది రేవంత్ వాదన. తప్పనిసరైతే షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని ఢిల్లీ పెద్దలకు సూచించారు రేవంత్ రెడ్డి. ఇక ఏపీలోను షర్మిల ఎంట్రీపై అక్కడి కాంగ్రెస్ నేతలు పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదని చెబుతున్నారు. షర్మిల వల్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌కే లాభం జరుగుతుంది తప్ప, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం లేదని అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. షర్మిల మాత్రం పాలేరు నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టడంతో ఏం చేయాలన్నదానిపై అధిష్టానం ఆలోచనల్లో పడింది. అయితే అటు షర్మిల, ఇటు రేవంత్ తోనూ చర్చలు జరిపిన కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్.. మొత్తానికి విలీనానికి లైన్ క్లియర్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌తో అనుబంధం.. షర్మిల స్వయంగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం వల్ల రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకించినా.. ఆమె సేవలను మరోరూపంలో వాడుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.

Also Read: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ సీనియర్ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

ఎటువంటి షరతులు, హామీలు లేకుండా వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల సైతం బేషరతుగా పార్టీని విలీనం చేసేందుకే మొగ్గు చూపారని సమాచారం. అవసరమైతే షర్మిల సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, లేదంటే కర్ణాటక నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత అప్పుడున్న పరిస్థితులను బట్టి ఖమ్మం లేదంటే సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి కొంతమేర టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పంతం నెగ్గినా.. షర్మిల పార్టీ విలీనాన్ని మాత్రం పూర్తిగా అడ్డుకోలేకపోయారు. అటు షర్మిల సైతం పాలేరు నుంచి పోటీ చేసి తీరుతానన్న పట్టుదల నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరికి బేషరతుగా షర్మిల పార్టీని విలీనం చేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానానిదే పైచేయి అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.