AP: ఏపీ సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట నిషేధం.. వారికి మాత్రం మినహాయింపు.. ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Fishing ban
AP: మత్స్యవనరుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు సముద్ర తీరంలో చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తూర్పు తీరంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు, అండమాన్ నికోబార్ తీరంలోని ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ తో పాటు ప్రాదేశిక జలాల్లో కేంద్ర ప్రభుత్వం చేపల వేటను నిషేదించింది. అటు పశ్చిమ తీరం ప్రాంతంలోనూ జూన్ 1 నుంచి జూలై 31 వరకూ 61 రోజుల పాటు చేపల వేట నిషేధం ఉంటుందని కేంద్రం తెలిపింది.
మెకనైజ్డ్ షిపింగ్, మోటరైజ్డ్ పడవలపై చేపల వేట చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంప్రదాయ పడవలకు మినహాయింపు ఇచ్చారు. సంప్రదాయ నాటు పడవలు మినహా ఇతర బోట్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు నిషేదాజ్ఞలతో కూడిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది.