బాబోయ్.. చూస్తుండగానే పేక ముక్కలా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్
సిమ్లాంలోని ఓ భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే, ముందస్తుగా ఆ భవనంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించడంతో పెనుప్రమాదం తప్పింది.

Himachal Pradesh
Himachal Pradesh: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్నిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని పది జిల్లాలకు భారత వాతావరణ శాఖ వరద హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
సిమ్లాలోని భట్టకుఫర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం రాత్రి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. సోమవారం ఉదయం కూడా భారీ వర్షాల కారణంగా ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ముందు జాగ్రత్త చర్యగా అందులోని నివాసితులను అధికారులు ముందే ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. దీనికితోడు సమీపంలోని మరిన్ని భవనాలకూ ప్రమాదం పొంచిఉండటంతో అధికారులు అప్రమత్తమై స్థానికులను తమ ఇండ్ల నుంచి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఐదంస్తుల భవనం నేలకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
First rain and a multiple story building collapses in Shimla. Monsoon has just started and destruction is already here. Big question is what lessons were learnt from previous disasters or are we going to repeat the same story again? pic.twitter.com/r8tB9jZxjq
— Nikhil saini (@iNikhilsaini) June 30, 2025
సిమ్లా, చండీగఢ్‌లను కలిపే సిమ్లా-కల్కా జాతీయ రహదారిపై కోటి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారి దెబ్బతింది. ఫలితంగా గంటల తరబడి రెండు, మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో 129 రోడ్లు మూసుకుపోయాయని, సిర్మౌర్, మండి జిల్లాల్లో భారీగా రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత తగ్గేవరకు పాఠశాలలను మూసివేయాలని కాంగ్రా, మండి, సిర్మౌర్, సోలన్ జిల్లాల ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు ఆదేశించారు.