Headlines : మంత్రి పదవులపై ఢిల్లీలో కీలక సమావేశాలు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతమైంది. యశోద వైద్యులు కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు.

11PM Headlines
ఖర్గేతో సీఎం రేవంత్ చర్చలు
తెలంగాణ మంత్రి పదవులపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మానిక్ రావు ఠాక్రే కలిశారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై ఖర్గేతో చర్చించారు. ఖర్గేతో భేటీకి ముందు కేసీ వేణుగోపాల్ నివాసంలో గంటన్నర పాటు చర్చలు జరిగాయి. మంత్రులకు శాఖల కేటాయింపు, ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానాల భర్తీపై చర్చించినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు. ”తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి. కొడంగల్ లో నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్ గిరి చలించింది. కేవలం 14 రోజుల వ్యవధిలోనే నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది. ఈరోజు తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి పునాదులు పడింది మల్కాజ్ గిరిలోనే” అని లేఖలో పేర్కొన్నారు.
కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం అయింది. యశోద వైద్యులు కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు. నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారు. కాసేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయున్నారు.
కేసీ వేణుగోపాల్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీ వేణుగోపాల్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ మేరకు శుక్రవారం ఆయనతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రోహిత్ చౌదరి పాల్గొన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు, ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానాల భర్తీ, గ్యారెంటీల అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది.
డబుల్ ఎంట్రీ ఓట్లపై విచారణకు ఈసీ ఆదేశం
తెలంగాణ, ఏపీలో డబుల్ ఓట్ల ఎంట్రీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. డబుల్ ఎంట్రీ ఓట్లపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా
డిసెంబర్ 11న జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటీ 14వ తేదీకి వాయిదా పడింది. 14వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. తుఫాన్ సహాయక చర్యల్లో మంత్రులు, ప్రభుత్వం బీజీగా ఉండటంతో 11న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది.
తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేత
తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను, కమీషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను ప్రభుత్వం ఎత్తివేయనుంది.
రేపటి అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన బీజేపీ
రేపటి అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రకటించారు. కాసీం రిజ్వీ వారసుడు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాము ప్రమాణం చేయబోమని స్పష్టం చేశారు. తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని తెలిపారు.
కేటీఆర్‌కు సీఎం జగన్ ఫోన్
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కాలు తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు.
ఈ మేరకు కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.
కేసీఆర్ కు శస్త్ర చికిత్స
శస్త్రచికిత్స కోసం మాజీ సీఎం కేసీఆర్ ను వైద్యులు ఆపరేషన్ థియేటర్ లోనికి తీసుకెళ్లారు. అయిదుగురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో కేసీఆర్ కు శస్త్రచికిత్స జరుగుతోంది.
ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ
ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించారు. రేపు ఉదయం11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్బరుద్దిన్ ఓవైసీ చేత గవర్నర్ తమిలి సై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ విధి విధానాలు ప్రకటించింది. రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనున్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.
బీఆర్ఎస్ పక్ష నేతగా కేసీఆర్!
రేపు ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
సభ్యత్వం రద్దు..
టీఎంసీ ఎంపీ మొహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది. నైతిక విలువల కమిటీ నివేదికకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నైతిక విలువల కమిటీ నివేదికతో లోక్ సభ మొహువా మొయిత్రా సభ్యత్వం రద్దు చేసింది. డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మొహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మెయిత్రాపై చర్యలు తీసుకుంది.
ఎవ్వరు రావద్దు..
కాలు జారి పడ్డ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్నారు. ఆయనను చూడటానికి అభిమానులు ఎవ్వరు రావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారని..కాబట్టి కేసీఆర్ ను చూసేందుకు ఎవ్వరు రావద్దని సూచించారు.
కేసీఆర్ ఆరోగ్యంపై పవన్ కల్యాణ్..
కాలు జారి పడిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజలకు ఆయన సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ ఆరోగ్యంపై చంద్రబాబు స్పందన
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఆరా తీశారు. ‘‘కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి ఆందోళన చెందాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సీఎం ప్రమాణం..
మిజోరాం సీఎంగా లాల్ దుహోమా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంతో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణం చేయించారు. కాగా ఎన్నికల్లో ZPM పార్టీ ఘన విషయం సాధించిన విషయం తెలిసిందే.
మాజీ సీఎం ఆరోగ్యంపై కొత్త సీఎం ఆరా
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం సీఎం రేవంత్ ఆరా తీశారు.మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు యశోద ఆసుపత్రికి అధికారులు వెళ్లి..కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్యం పై ఎప్పడి కప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
కేసీఆర్ హెల్త్ బులిటెన్
యశోద ఆస్పత్రి డాక్టర్లు మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.కేసీఆర్ కు మేజర్ సర్జరీ నిర్వహించాలని వెల్లడించారు.కేసీఆర్ ఎడమ కాలు తుంటి భాగంలో బాల్ రీప్లేస్ మెంట్ చేయాలని తెలిపారు.సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేస్తామని తెలిపారు. సర్జరీ తరువాత కేసీఆర్ నాలుగైదు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని..6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
సీఎంకు వినతిపత్రం..
ప్రజాభవన్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తున్న తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వినతిపత్రం ఇచ్చారు. ప్రజాదర్భార్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న రేవంత్ స్వయంగా వారి సమస్యలను పరిశీలిస్తున్నారు.
కేసీఆర్ కోలుకోవాలి..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి ఫాంహౌజ్ లో జారి పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడ్డానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని అన్నారు. ఈ విషయమై ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు.
ధరణి పోర్టల్ ఉద్యోగుల అక్రమాలు..
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి పోర్టల్ ఉద్యోగుల చేతివాటం బయటపడింది. డిజిటల్ సంతకాలతో ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కేసీఆర్‌కు ప్రమాదం.. ఎముక విరిగిందన్న వైద్యులు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ కి వెళ్లిపోయారు.
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సీరియస్
విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా ఆమోదించవద్దని ఆయన ఆదేశించారు.
కీలక సమావేశం
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై నేడు కాంగ్రెస్ మరోసారి సమావేశం కానుంది. గురువారం సాయంత్రం ఈ ఆరు గ్యారెంటీలపై కేబినెట్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం రెండు గ్యారెంటీల అమలుకు పచ్చ జెండా ఊపింది. కాగా ఈరోజ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
బాధితులకు అండగా కదిసిన సీఎం జగన్
నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లో వైఎస్ జగన్ టూర్ ఉంటుందని సీఎంవో తెలిపింది.
పొత్తు అవసరం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జనసేన-టీడీపీ పొత్తు ఒక్కటే మార్గమని జనసేన అధినేత పవన్ కల్యాన్ అన్నారు. మార్పు కోసం ఓట్లు కావాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.
నేనున్నానంటూ..
గుంటూరు ప్రకాశం జిల్లాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పంటనష్టం బాధితులను ఆయన పరామర్శించనున్నారు.
ఏం జరుగునో?
ఎంపీ మహువా సభ్యత్వాన్ని రద్దు చేయాలనే తీర్మానం నేడు లోక్‌సభలోకి రానుంది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ.. ఇప్పటికే నివేదిక ఇచ్చింది.
చెన్నై ఇంకా వరదలోనే..
వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నై నగరం ఇంకా వరద నీటిలోనే ఉంది. బాధితులకు హెలికాఫ్టర్లతో సాయం అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టింది.