మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్‌కు కొత్త తంటాలు.. ఇదే అతి పెద్ద టాస్క్‌గా మారిందా?
మొదటిసారి చాకచక్యంగా వ్యవహరించినప్పటికి...రాను రాను ఇద్దరి మధ్య తలెత్తే విభేధాలను మంత్రిగా లక్ష్మణ్ ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

జగిత్యాల జిల్లా నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కింది. పొలిటికల్, క్యాస్ట్ ఈక్వేషన్స్ మధ్య అదృష్టం ఆయన తలుపుతట్టింది. అయితే పదవి దక్కిందన్న ఆనందం కంటే ఆయనకో ఇష్యూ తలనొప్పిగా మారిందట. సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డికి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య రాజీ కుదర్చడమే మంత్రిగారికి పెద్ద టాస్క్ అంటున్నారు. ఆ ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు పీసీసీ చేసిన ప్రయత్నాలు ఇప్పటికే విఫలమయ్యాయి. అప్పటి నుంచి అటు జీవన్‌రెడ్డి, ఇటు సంజయ్ ఇష్యూ ఏదైనా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరికీ రాజీ కుదర్చడం అయ్యే పని కాదంటున్నారు క్యాడర్.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..జీవన్ రెడ్డి శిష్యుడనేది ఓపెన్ సీక్రెట్. జీవన్ రెడ్డి మాట అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జవ దాటరనే టాక్ ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవన్‌రెడ్డి వెన్నంటే ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది సాధ్య పడింది. కానీ మంత్రి పదవి దక్కిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను కలుపుకుని పోవాల్సి ఉంటుంది.
అలా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో సఖ్యతగా ఉంటే..జీవన్ రెడ్డి ఫీలాయ్యే ఛాన్స్ లేకపోలేదు. పోని జీవన్ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తే..ఎమ్మెల్యే సంజయ్‌కి ప్రోటోకాల్ ఉల్లంఘన చేసినట్లవుతుంది. పోనీ ఇద్దరిని కలుపుకొని పోదామంటే జీవన్‌రెడ్డి ససేమీరా అంటారు. ఇప్పడు మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌కు ఈ ఇద్దరినీ సమన్వయం చేసుకుంటూ ముందు సాగడమే అసలు సవాల్‌గా మారిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
భారీగా ప్లెక్సీలు.. ఆ తర్వాత..
అడ్లూరికి మంత్రి పదవి దక్కడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భారీగా ప్లెక్సీలను పెట్టారు. జీవన్ రెడ్డి ప్లెక్సీలో సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ ప్లెక్సీల్లో జీవన్ రెడ్డి ఫోటోలను ప్రింట్ చేయలేదు. ఎవరికి వారే మంత్రి గారికి స్వాగత ఏర్పాట్లు చేశారు. ముందుగా జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న లక్ష్మణ్, ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏర్పాటు చేసిన అభినందన సభలో పార్టిసిపేట్ చేశారు.
మొదటిసారి చాకచక్యంగా వ్యవహరించినప్పటికి…రాను రాను ఇద్దరి మధ్య తలెత్తే విభేధాలను మంత్రిగా లక్ష్మణ్ ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య కొనసాగుతోన్న ఆధిపత్య పోరుతో తలనొప్పి ఎందుకుని..ఇప్పటికే పలువురు మంత్రులు జగిత్యాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చినవారికి జీవన్ రెడ్డి చురకలు అంటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిస్థితి ఆ ఇద్దరి మధ్య మద్దెల దరువు అన్నట్లుగా మారిందంటూ చర్చించుకుంటున్నాయి జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు. గురువు గారి కోసం అడ్లూరి ఏం చేస్తారో.? ఎమ్మెల్యేతో ఎలా వ్యవహరిస్తారో.? చూడాలి మరి.