5నెలల తర్వాత ప్రభుత్వ స్కూళ్లకు టీచర్లు, రవాణా వసతి లేక ఇబ్బందులు

Telangana School Reopening: ఎట్టకేలకు తెలంగాణలో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి. గురువారం(ఆగస్టు 27,2020) టీచర్లు బడిబాట పట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూల్స్ 5 నెలలకు పైగా మూతబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామమాత్రంగానే తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగా కేవలం టీచర్లు మాత్రమే విధులకు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు విద్యార్థులెవరూ పాఠశాలలకు హాజరు కావొద్దని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
సొంత వాహనాలపైనే స్కూళ్లకు:
అయితే, టీచర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. విధులకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న ఉపాధ్యాయులు బడికి ఎలా వెళ్లాలనే ఆందోళనలో పడ్డారు. ప్రస్తుతం ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించడమే వారి ఆందోళనకు కారణం. ప్రధాన రహదారులలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా గ్రామాలకు, మారుమూల పల్లెలకు మాత్రం వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లాల్సిన టీచర్లు సొంత, ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడాలి. కానీ, ప్రైవేట్ వాహనాలు కూడా అరకొరే అందుబాటులో ఉన్నాయి.