TG Special TET : టీచర్లకు శుభవార్త.. ప్రమోషన్లకు లైన్ క్లియర్.. ఆ 27 వేల మందికి బిగ్ రిలీఫ్
TG Special TET : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 27 వేల మంది ఉపాధ్యాయులు లబ్ధి పొందనున్నారు.
Telangana govt conduct two special tet for 27000 inservice teachers within 2026 december
- ఈ ఏడాదిలోనే టీచర్లకు 2 స్పెషల్ టెట్లు
- టెట్ పాస్ కావాల్సిన టీచర్లు 27 వేల మంది
- ఏప్రిల్ లోగానే నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు
TG Special TET : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించే దిశగా చర్యలకు పూనుకుంది. ఈ ఉపాధ్యాయులు ప్రమోషన్ కు అర్హత సాధించాలంటే.. తప్పకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) క్వాలిఫై కావాలి. కానీ చాలా మంది టీచర్లు ఈ అర్హత సాధించక పదోన్నతులకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు రెండు ప్రత్యేక టెట్లను నిర్వహించాలని భావిస్తోన్న విద్యాశాఖ.. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
గతంలో 2011 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని భావించారు. కానీ 2025లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ప్రకారం.. పదోన్నతులు పొందే ప్రతి ఉపాధ్యాయుడు.. టెట్ పాస్ కావడం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో టెట్ క్వాలిఫై కాని టీచర్లు.. 31 మార్చి 2027 నాటికి టెట్ సాధించకపోతే పదోన్నతులకు అనర్హులుగా ఉంటారని నిబంధన విధించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యాశాఖ రెండో టెట్ నిర్వహించాలని భావిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు 1.02 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 57 వేల మంది టెట్ అర్హత సాధించలేదు. అయితే గతంలో వివిధ దశల్లో విద్యాశాఖ నిర్వహించిన టెట్ లో 30 వేల మంది టీచర్లు అర్హత సాధించారు. ఇంకా 27 వేల మంది టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. ప్రస్తుతం విడుదలైన టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతమంది గట్టెక్కే అవకాశం ఉన్నప్పటికీ, మిగిలిన వారందరికీ ఈ ఏడాది నిర్వహించే రెండు ప్రత్యేక టెట్లు కీలకం కానున్నాయని చెప్పవచ్చు.
