Tirumala Srivari Pushpayagam : సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం.. తిరుమల ఆలయంలో వైభవంగా పుష్పయాగ మహోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు.

Tirumala Srivari Pushpayagam : సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం.. తిరుమల ఆలయంలో వైభవంగా పుష్పయాగ మహోత్సవం

Updated On : November 1, 2022 / 9:10 PM IST

Tirumala Srivari Pushpayagam : పవిత్ర కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగు రంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో ఉద‌యం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేప‌ట్టారు. మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

Tirumala Srivari Pushpayagam

స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు.

ముందుగా ఉద‌యం ఉద్యాన‌వ‌న విభాగం కార్యాల‌యం నుండి శ్రీవారి ఆల‌యం వ‌ర‌కు పుష్పాల ఊరేగింపు వైభ‌వంగా జ‌రిగింది. పుష్పాల దాత‌లు, శ్రీ‌వారి సేవ‌కులు గోవింద‌ నామ‌స్మ‌ర‌ణ‌తో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.

Tirumala Srivari Pushpayagam

బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్ల గానీ, ఉద్యోగుల వ ల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తార‌ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం జ‌రుగుతోంద‌ని, ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవం 1980 నుండి పునరుద్ధర‌ణ జ‌రిగిందన్నారు. పుష్ప యాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు.

శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులును ఆల‌య అధికారులు ఘనంగా సన్మానించారు.