Bengaluru Stampede: నా కొడుకు ఇక్కడ నిద్రపోతున్నాడు, నేనూ ఇక్కడే.. తొక్కిసలాటలో చనిపోయిన కొడుకు సమాధిపై పడుకుని బోరున విలపించిన తండ్రి..

Bengaluru Stampede: నా కొడుకు ఇక్కడ నిద్రపోతున్నాడు, నేనూ ఇక్కడే.. తొక్కిసలాటలో చనిపోయిన కొడుకు సమాధిపై పడుకుని బోరున విలపించిన తండ్రి..

Updated On : June 8, 2025 / 9:06 PM IST

Bengaluru Stampede: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11మంది అమాయకులు చనిపోయారు. తమకు ఇష్టమైన ప్లేయర్లను కళ్లారా చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల్లో ఎక్కువగా 20ఏళ్ల వయసున్న వారే ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది. చనిపోయిన వారంతా చేతికి అందివచ్చిన పిల్లలే. ఇది ఆ కుటుంబాలను మరింత ఆవేదనకు గురి చేస్తోంది.

బెంగళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో చనిపోయిన ఓ యువ‌కుడి తండ్రి గుండె పగిలేలా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కొడుకు సమాధిపై పడుకుని అతడు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆ తండ్రి మాటలు గుండెను బరువెక్కిస్తున్నాయి.

తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారిలో భూమిక్ ఉన్నాడు. అతడి వయసు 19ఏళ్లు. కొడుకు మృతిని తండ్రి తట్టుకోలేకపోతున్నాడు. భూమిక్ తండ్రి లక్ష్మణ్ కు చెందిన వీడియోలు కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. కొడుకు సమాధిపై పడుకుని అతడు బోరున విలపించాడు. నేను ఎక్కడికీ వెళ్లను..నా కొడుకు దగ్గరే ఉంటాను అంటూ ఆ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యాడు.

‘నా కొడుకు ఇక్కడ నిద్రపోతున్నాడు. నేను కూడా నా కొడుకుతో ఇక్కడే పడుకుంటాను. నేను అతడి కోసమే ఈ భూమి కొన్నాను. ఇప్పుడు అదే భూమిలో నా కొడుకుని పడుకోబెట్టాను. మరే తల్లి, తండ్రి ఇలా బాధపడకూడదు” అంటూ బోరున విలపించాడు లక్ష్మణ్.

కొడుకు స‌మాధిపై పడుకుని ఆ తండ్రి ఏడుస్తుంటే చూస్తున్న‌వాళ్ల‌కు సైతం క‌న్నీళ్లు వస్తున్నాయి. అతడి బాధ చూసి అంతా తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి క‌ష్టం ఏ తల్లికి, ఏ తండ్రికి రాకూడ‌దని వాపోతున్నారు. ఆ తండ్రి కడుపు కోత ఎవరూ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరోలు, క్రికెట‌ర్లు బాగానే ఉంటారు.. వారి మోజులో పడి మీ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని యువతకు సూచిస్తున్నారు. మిమ్మల్ని కన్న వారికి గుండెకోత మిగల్చొద్దని అభ్యర్థిస్తున్నారు.

Also Read: యువత ప్రాణాలు తీస్తున్న కొత్త సోషల్ మీడియా ఛాలెంజ్.. అసలేంటీ డస్టింగ్ ఛాలెంజ్, ఎందుకు ప్రాణాంతకం, ఎలా చనిపోతారు?

భూమిక్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. బసవనగుడిలోని BIT కాలేజీ విద్యార్థి. ఈ నెల 4న ఆర్సీబీ విక్టరీ పరేడ్ చూసేందుకు వెళ్లి తొక్కిసలాటలో చనిపోయాడు. జూన్ 7న హనస్ జిల్లా కుప్పగోడు గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. తన కొడుకు భూమిక్ సమాధాపై పడుకుని తండ్రి లక్ష్మణ్ బోరున విలపించిన వైనం హృదయాలను మెలి పెడుతోంది. ఆ రోజు నా కొడుకు ఎప్పటిలానే కాలేజీకి వెళ్లాడు. ఆ తర్వాత తన తల్లికి ఫోన్ చేశాడు.

ఆర్సీబీ విక్టరీ పరేడ్ చూసేందుకు తన ఫ్రెండ్స్ తో కలిసి చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వెళ్తున్నట్లు చెప్పాడు. అదే నా కొడుకు చివరి మాటలు. ఆ తర్వాత నా కొడుకు లేడు. ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని నేను ఆలోచిస్తున్నాను. మరణించిన ఇతర బాధితుల కుటుంబాల మద్దతు మాకు లభిస్తే, మేము దీన్ని చేయగలం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సిద్ధరామయ్య ప్రభుత్వం మా పిల్లలను హత్య చేసిందని చెబుతూ మేము ఫిర్యాదు చేస్తాము” అని లక్ష్మణ్ చెప్పారు.

”నాకు ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం అవసరం లేదు. నా కొడుకును నా దగ్గరకు తీసుకురండి. ప్రభుత్వం నిర్లక్ష్యం నా ఇంటిని నాశనం చేసింది” అని లక్ష్మణ్ మండిపడ్డారు. కొడుకు సమాధిపై పడుకుని తండ్రి లక్ష్మణ్ విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని రేకెత్తించాయి.