Paytm : పేటీఎంకు ఏమైంది? ఫిబ్రవరి 29 తర్వాత పని చేస్తుందా? లేదా? తీవ్ర ఆందోళనలో కస్టమర్లు
ఆర్బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సంక్షోభంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు.

What Happend To Paytm App
Patym : పేటీఎం యాప్ కి ఏమైంది? యూపీఐతో క్యాష్ లెస్ చెల్లింపుల్లో సరికొత్త చరిత్ర సృష్టించి డిజిటల్ విప్లవం సృష్టించిన పేటీఎం.. ఈ నెల 29 తర్వాత పని చేస్తుందా? లేదా? ఆర్బీఐ అసలు పేటీఎంపై తీసుకున్న చర్యలు ఏంటి? ఈ మొత్తం వ్యవహారంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఏమంటున్నారు? ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యధావిధిగా పనిచేస్తుందని, ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు అని విజయ్ శేఖర్ శర్మ అంటున్నారు. పేటీఎం షేర్ ధర భారీగా పడిపోతున్న సమయంలో తన ప్రకటన ద్వారా వాటాదారులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
నాలుగు రోజులుగా పేటీఎం వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాదాపు అందరి ఫోన్లలో పేటీఎం యాప్ ఉంటుంది. పేటీఎం పోటీ యాప్ లు భారీగా పెరిగిపోయినప్పటికీ యూపీఐ చెల్లింపుల్లో పేటీఎం అగ్రస్థానంలోనే ఉంది. పేటీఎం కరో అనే యాడ్ ద్వారా రోజువారీ జీవితంలో భాగమైపోయింది. డిజిటల్ చెల్లింపులను ఇంతలా అందరికీ చేరువ చేసిన పేటీఎం.. ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లతో ఇంటింటి మార్మోగిన పేటీఎం.. తరుచూ నిబంధనలను ఉల్లంఘిస్తోందిన ఆర్బీఐ చేస్తున్న ఆరోపణ. అందుకే, పేటీఎంపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
Also Read : పేటీఎంకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. పేమెంట్స్ బ్యాంకు సర్వీసులపై నిషేధం.. ఎప్పటినుంచంటే?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ నెల 29 తర్వాత పని చేయబోదని తెలిపింది. అయితే, ఆర్బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొత్తం యాప్ పై ఆర్బీఐ చర్యలు తీసుకోలేదు. కేవలం పేటీఎంలోని పేమెంట్స్ బ్యాంక్, వాలెట్, ఫాస్టాగ్ సేవలను నిలిపివేస్తుంది. దీని ప్రకారం పేమెంట్స్ బ్యాంక్ లో డిపాజిట్, లావాదేవీలు, వాలెట్, ఫాస్టాగ్, టాపప్ నిలిచిపోతుంది. దీనివల్ల పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో డబ్బు క్రెడిట్ చేసుకోవడం, తీసుకోవడం, పేటీఎం వాలెట్ లో డబ్బు ఉంచడం కుదరదు. యాప్ ద్వారా చేసుకునే మిగిలిన లావాదేవీలు.. అంటే.. ఫోన్ నెంబర్ కు , క్యూఆర్ కోడ్ కు డబ్బులు పంపడం, తీసుకోవడం, షాపింగ్, జర్నీ టికెట్ల కొనుగోలు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.
డిజిటల్ చెల్లింపులతో సేవలు ప్రారంభించిన పేటీఎం తర్వాత తన సేవలను విస్తృతంగా విస్తరించింది. వాటిలో పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. చెల్లింపులూ చేసుకోవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యాపారులకు చెల్లింపులు చేస్తే అవి ముందుగా పేమెంట్స్ అకౌంట్ లోకి వెళ్లి తర్వాత బ్యాంకు ఖాతాలోకి బదిలీ అవుతాయి. 2017లో పేటీఎం ఈ సర్వీస్ ని ప్రారంభించింది. 197 కమ్యూనికేషన్స్ ద్వారా నిర్వహిస్తోంది. దీనిపైనే ఇప్పుడు ప్రభావం పడుతుంది. అలాగే, ఆర్బీఐ నిర్ణయం వల్ల పేటీఎం వ్యాలెట్ కూడా పని చేయదు. వ్యాలెట్ లో ఉన్న డబ్బులు వేరే ఖాతాకు బదిలీ చేసుకోవాలి.
Also Read : డార్క్ వెబ్‌లో విక్రయానికి భారత్‌లోని 750 మిలియన్ల టెలికాం యూజర్ల డేటా.. సైబర్ నిపుణులు వెల్లడి..!
పేటీఎంలో ఉన్న డబ్బులు హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐతో పాటు ఇతర గుర్తింపు పొందిన బ్యాంకు ఖాతాలను థర్డ్ పార్టీ బ్యాంకుగా పేటీఎంకు లింక్ చేసుకుని లావాదేవీలను యధావిధిగా వాడుకోవచ్చు. అంటే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాలెట్ పని చేయదు. కానీ, యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. అందుకే, పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ కూడా పని చేయదు. వినియోగదారులు బ్యాలెన్స్ ను వేరే ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి, ఉపయోగించుకోవడానికి పేటీఎం సహకరించాలని ఆర్బీఐ ఆదేశించింది. మార్చిలోపు నోడల్ అకౌంట్ ను సెటిల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ సంక్షోభంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. పేటీఎం ప్రస్తుతం పని చేస్తుందని, ఫిబ్రవరి 29 తర్వాత కూడా పని చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందన్నారు విజయ్ శేఖర్ శర్మ.