YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాది.. షర్మిలను బహిష్కరిస్తున్నాం..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ తమదని, వైఎస్ షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు అన్నారు.

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాది.. షర్మిలను బహిష్కరిస్తున్నాం..

YS Sharmila expelled from ysr telangana party

YS Sharmila expelled: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నాయకులు తిరుబాటు చేశారు. అసలు పార్టీయే తమదని, షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. గట్టు రామచంద్రరావు నాయకత్వంలో వైఎస్పార్ టీపీ నాయకులు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో భేటీ అయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రకటించారు. షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. ద్రోహి షర్మిల అంటూ నినాదాలు చేశారు. షర్మిలను నమ్మి మోసపోయామని.. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అని ఇన్నాళ్లు గౌరవించామన్నారు. తెలంగాణ సమాజంలో షర్మిలకు స్థానం లేదని, ఆమెను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణకు షర్మిల నాయకత్వం అవసరం లేదు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ తమదని, వైఎస్ షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు ఈ సందర్భంగా అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీతో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని, ఆమెకు సభ్యత్వమే లేదని ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ షర్మిలది కాదని కుండబద్దలు కొట్టారు. రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణకు షర్మిల నాయకత్వం అవసరం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను షర్మిల మోసం చేశారని, తడి గుడ్డతో గొంతు కోశారని వాపోయారు.

ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం
తెలంగాణ సమాజంలో షర్మిలకు స్థానం లేదని, ఆమెను బహిష్కరించాలని పలువురు వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. YSRTPకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ మద్దతు అడగకముందే ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. భవిష్యత్తులో షర్మిల ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్నారు. నేను నిలబడతా, మిమ్మల్ని నిలబడతా అని చెప్పిన షర్మిల ఈరోజు మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టారని వాపోయారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న షర్మిల.. రేవంత్ రెడ్డిని దొంగ అని ఆరోపణలు చేస్తున్నారని.. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని అర్థమవుతోందన్నారు. షర్మిలతో పోల్చుకుంటే కేఏ పాల్ చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. షర్మిలను నమ్మి ఆమె వెంట నడిచినందుకు తమను క్షమించాలని తెలంగాణ సమాజాన్ని వేడుకున్నారు.

Also Read: రాహుల్ గాంధీ నాకు కాల్ చేసి మద్దతు అడిగారు.. ఇవ్వనని చెప్పాను : కేఏ పాల్