అదే నిర్లక్ష్యం : ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో పసిబిడ్డ మాయం

ప్రభుత్వ ఆస్పత్రులలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం (నవంబర్ 26) ఉదయం నుంచి శిశువు కిడ్నాప్ కు గురైంది. పాలుతాగే బిడ్డ కనిపించకుండా పోవటంతో కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కందుకూరుకు చెందిన రమాదేవి ప్రసవించింది. తరువాత కొద్ది రోజులకు శిశువు అనారోగ్యానికి గురవ్వటంతో మెరుగైన వైద్యం కోసం వేంసూర్ ఆస్పత్రి డాక్టర్లు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావటం..డాక్టర్లు అడ్మిట్ చేసుకుని ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ మహిళ బిడ్డను ఎత్తుకెళ్లిపోయింది. దీంతో రమాదేవి..ఖమ్మం టూటైన్ పోలీసులకు ఫిర్యాుద చేయటంతో సీసీటీవీ పుటేజ్ ఆధారంగా బిడ్డను ఎత్తుకుపోయిన మహిళకు గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
బిడ్డను ఎత్తుకుపోతున్న మహిళ స్పష్టంగా సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఈ పుటేజ్ ఆధారంగా పోలీసులు సదరు మహిళ కోసం గాలిస్తున్నారు. కాగా..గతంలో కూడా ఖమ్మం ఆస్పత్రిలో ఇద్దరు పసిబిడ్డల మిస్సింగ్ జరిగింది. కానీ ఇప్పటి వరకూ ఆ పసిబిడ్డలు ఆచూకీ లభించనేలేదు. అయినా ఆస్పత్రి యాజమాన్యం మాత్రం భద్రత విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు దారి తీస్తోంది.