ప్రభుత్వం కీలక నిర్ణయం : సగానికి తగ్గనున్న బార్లు

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 04:39 AM IST
ప్రభుత్వం కీలక నిర్ణయం : సగానికి తగ్గనున్న బార్లు

Updated On : November 11, 2019 / 4:39 AM IST

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. విడతల వారీగా మద్యం షాపులను తగ్గిస్తామని తెలిపిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్ణయించింది. మద్యం షాపులు తగ్గించినా బార్ల ద్వారా మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా బార్ల కుదింపుపై కూడా దృష్టి పెట్టింది ప్రభుత్వం. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 840 వరకూ బార్లు ఉన్నాయి. వీటిలో సగం అంటే 420 వరకు బార్లు రద్దు కానున్నాయి. 2019 చివరికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. 2020 జనవరి 1 నుంచి నూతన బార్‌ పాలసీని అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 

అంతేకాదు బార్ల నిర్వహణ సమయాలను కుదించేలా కూడా చర్యలు తీసుకోనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ బార్లలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.  ఈ సమయాన్ని రెండు గంటలు తగ్గించనున్నారు. ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేసేలా కొత్త సమయాలను అమల్లోకి తీసుకురానుంది.

ప్రస్తుతం బార్ల లైసెన్స్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్‌ ద్వారా లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇప్పుడున్న బార్లకు 2022 వరకూ లైసెన్సుల గడువు ఉంది. వీటికి కూడా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావటమే కాక.. కొత్త లైసెన్సులకు అవకాశం ఇవ్వనుంది ప్రభుత్వం.