30 రాజధానులంటూ వెటకారాలా? పెద్దిరెడ్డికి మతి ఉందా : రైతుల ఆగ్రహం

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 06:23 AM IST
30 రాజధానులంటూ వెటకారాలా? పెద్దిరెడ్డికి మతి ఉందా : రైతుల ఆగ్రహం

Updated On : December 20, 2019 / 6:23 AM IST

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాల్ని రగిలిస్తున్నాయి. ఏపికి మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న పెద్దిరెడ్డి లాంటివారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటమేంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెద్దిరెడ్డికి అసలు మతి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. తమ బాధలు మంత్రిగారికి వెటకారాలుగా ఉన్నాయా అంటూ మండిపడుతున్నారు. మంత్రి పదవిలో ఉండి నోటికి వచ్చినట్లల్లా మాట్లాడితే సహించమని హెచ్చరిస్తున్నారు. 

సీనియర్ నాయకుడు అయి ఉండి పెద్దిరెడ్డి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి.. రైతుల జీవితాలంటే ఆటలుగా ఉన్నాయా? మా భవిష్యత్తు ఏంటి అని తాము ఆందోళన పడుతుంటే పుండుమీద కారం చల్లినట్లుగా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయనీ..వెంటనే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతికి రైతుల వద్ద తీసుకున్న భూముల్ని తిరిగి ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి అన్నారు.

దీనికి రైతులు మాట్లాడుతూ..ఐదు సంవత్సరాల క్రితం మా భూములు ఎలా ఉన్నాయో పెద్దిరెడ్డిగారు ఎప్పుడైనా చూశారా? పచ్చని పొలాలుగా కళకళలాడిపోయే భూముల్ని రాజధాని కోసం ఇచ్చాం..ఇప్పుడవి స్థలాలుగా మారాయి. రోడ్లు కూడా వచ్చాయి. పంటలు పండే పొలాల్ని మా దగ్గర నుంచి తీసుకుని స్థలాలుగా మార్చి మాకు ఇచ్చేస్తారా? ఇప్పుడు మేము వాటిని ఏం చేసుకోవాలని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. రైతుల జీవితాలను పణ్ణంగా పెట్టి పచ్చనిపొలాలను ఇచ్చే ఇప్పుడు అధికారంలోకి వచ్చి  ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.