తెలంగాణ ఊటీగా అనంతగిరి

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 03:36 AM IST
తెలంగాణ ఊటీగా అనంతగిరి

Updated On : November 14, 2019 / 3:36 AM IST

అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం (నవంబర్ 13, 2019) మంత్రులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో కలిసి అనంతగిరి కొండల్లో పర్యటించారు. అనంతగిరి ప్రాంతంలోని వాచ్‌టవర్‌, వ్యూ పాయింట్‌, నందిఘాట్‌, శివారెడ్డిపేట్‌ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఏండ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అనంతగిరి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకదృష్టి సారించారని తెలిపారు. 

ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రి సబితారెడ్డి అనంతగిరి గుట్టను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలనే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. ఈ ప్రాంతాన్ని వెంటనే అభివృద్ధి చేయాలని ఆదేశించారని, మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కోసం ప్రణాళికలు, నివేదికలు సమర్పించాలని ఆదేశించారని తెలిపారు.

అనంతగిరిని హాస్పిటల్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజం, అడ్వెంచర్‌ టూరిజంలా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అధికారులంతా టీం వర్క్‌ చేసి 10 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. తాము మరోసారి సమావేశమై చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రూ.300 కోట్లతో తెలంగాణలోనే అనంతగిరిని ఉత్తమ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని వివరాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేస్తున్నామని చెప్పారు. 10-15 రోజుల్లో వివరాలను వెల్లడిస్తామన్నారు. 

అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అడిగిన వెంటనే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకే అందరం ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు.