చేయూత : AP ఎన్నికల్లో వికలాంగుల చూపు ఎటో

  • Published By: madhu ,Published On : March 23, 2019 / 12:47 PM IST
చేయూత : AP ఎన్నికల్లో వికలాంగుల చూపు ఎటో

Updated On : March 23, 2019 / 12:47 PM IST

TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికలాంగులకు చేయూత అందించింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వికలాంగులను విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించింది. వీరి కోసం ఐదేళ్లలో సుమారు వెయ్యి బ్యాక్‌లాగ్‌ పోస్టులను సైతం భర్తీ చేసింది. 31 కోట్ల వ్యయంతో 60 వేల మందికి వివిధ రకాల ఉపకరణాలను అందించింది. మరి ఈ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు టీడీపీవైపు మొగ్గుచూపుతారా..? మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సాయపడతారా..? అసలు టీడీపీ వికలాంగుల కోసం ఏం చేసింది..? 
Read Also : అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్

వీళ్లలోని నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా వీరు ఎవరిపైనా అధారపడకుండా జీవించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలనూ చేపట్టారు. ప్రత్యేక పెన్షన్‌ విధానం, స్వయం ఉపాధి కోసం రాయితీ రుణాలు అందించడంతో పాటు వీరిని పెళ్లి చేసుకున్న సామాన్యులకూ వివాహ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో 31 కోట్ల 2 లక్షల 80 వేలకు పైగా వెచ్చించి 60 వేల 379 మందికి వివిధ రకాల ఉపకరణాలను అందించింది టీడీపీ ప్రభుత్వం. 3 శాతం రిజర్వేషన్లలో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు బ్యాక్‌లాగ్‌ కేటగిరిలో సుమారు వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు.

విద్యకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు.. గుంటూరు జిల్లా బాపట్లలో 10వ తరగతి వరకు ఉన్న బధిరుల పాఠశాలను జూనియర్‌ కాలేజీగా మార్చి ఉన్నత విద్యావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటు విశాఖపట్నంలో ప్రత్యేక ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విజయవాడలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణానికి 35 లక్షలను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. 
Read Also : నేను గెలిస్తే : హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేస్తా

రక్త సంబంధీకులు లేనివారు, బంధువుల నిరాదరణకు గురైనవారిని ఆదుకోవడానికి అనంతపురం, కాకినాడలో రెండు షెల్టర్‌ హోమ్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కోదానిలో 100 మంది ఉండేలా వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరులో సమీకృత పునరావాస కేంద్ర ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర 31 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారికి ఉచితంగా మూడు చక్రాల మోటార్‌ వాహనాలతో పాటు వీల్‌ చైర్స్‌, కృత్రిమ అవయవాలు, బూట్లు, చేతికర్రలు పంపిణీ చేశారు. అదేవిధంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు బ్రెయిలీ పుస్తకాలను పంపిణీ చేసింది. అంతేకాదు చేతికర్రలు, ల్యాప్‌టాప్స్‌, డైసీ ప్లేయర్లను లబ్ధిదారులకు అందించారు.

సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్న వారికి వృద్ధాప్యంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. సుమారు 50 లక్షలతో.. అన్ని నియోజకవర్గాల్లోని లబ్ధిదారుల్లో 6 వేల 500 వందల మందికి ఊతకర్రలు, 2 వేల 100 మందికి చెప్పులు, 2 వేల 100 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ఇక చదువులో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకూ ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ పంపిణీ చేస్తున్నారు. ఇలా విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది. మరి వీరు టీడీపీవైపు మొగ్గుచూపుతారా అనేది చూడాలి. 
Read Also : ఎక్కడికెళ్లినా వెంటాడి వేస్తాం : మోడీపై 111 మంది తమిళనాడు రైతులు పోటీ