పెళ్లిలో చిచ్చు పెట్టిన కోడి కూర : గాల్లోకి లేచి భోజనం ప్లేట్లు..రాళ్లతో చితక్కొట్టేసుకున్నారు

అందంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతోంది. ఓపక్క పెళ్లి వేడుక..మరోపక్క ఘుమ ఘుమలాడే వంటలతో పెళ్లి విందు. ఆ విందులో కోడి కూర స్పెషల్ ఎట్రాన్ గా నిలిచింది. ఘుమ ఘుమలాడిస్తూ కోడి కూర వాసన చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. దీంతో లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు పెళ్లికి వచ్చిన అతిథులు. అలా చక్కగా పెళ్లితో పాటు పెళ్లి విందు కూడా చక్కగా జరుగుతోంది. ఇంతలో కోడికూర పెద్ద చిచ్చుపెట్టేసింది.
వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందినకు రెల్లివీధికి చెందిన కూన సురేష్ కు పెళ్లి జరుగుతోంది. తరువాత పెళ్లివిందులో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనాల్లో కోడికూర వడ్డిస్తున్నారు. దాంట్లో పెళ్లి కుమార్తె వర్గానికి చెందిన కలింగపట్నం ప్రకాశ్ చికెన్ వడ్డిస్తున్నాడు. పెళ్లి కుమారుడి తరపు వారు తమ దర్పం చూపించాలను కున్నారు. సవ్యంగా జరుగుతున్న పెళ్లి విందులో కోడికూర వడ్డిస్తుండగా..సడెన్ భోజనం ప్లేట్లను పెళ్లికూతరు తరపువారి ముఖంపై కొట్టారు. దీంతో గొడవ పెద్దదైంది. అది ఘర్షణకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పి శాంతింపజేశారు.
ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడి తరుపువారికి చెందిన కలింగపట్నం గణేష్ మెడలోని బంగారు గొలుసు వధువు వర్గం వారు లాగేసుకున్నారని ఆరోపించారు. దీంతో మళ్లీ గొడమ ప్రారంభమైంది. రోడ్డుపైకి వచ్చి ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంట్లో సవలాపురం కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మళ్లీ పోలీసులు రంగంలోకి వచ్చారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కబెట్టటంతో పెళ్లి తంతు పూర్తయ్యింది. కానీ ఘర్షణలో కొట్టేసిన తమ బంగారాన్ని ఇవ్వాల్సిందేనని పట్టుపట్టటం..వారు పోలీస్ కేసు పెట్టటంతో పెళ్లి కుమార్తె తరుపువారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పెళ్లికూతురు తరపు వారు కూడా పెళ్లికొడుకు తరపువారిపై కేసు పెట్టారు. గాయపడిన వారిని పాతపట్నం ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.