సెంటిమెంట్ బాణాలు వదులుతున్న బాబు..వర్కవుట్ అయ్యేనా

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 01:28 AM IST
సెంటిమెంట్ బాణాలు వదులుతున్న బాబు..వర్కవుట్ అయ్యేనా

Updated On : April 8, 2019 / 1:28 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో సెంటిమెంట్‌ రగలిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మోడీ, జగన్‌, కేసీఆర్‌లను దొంగల ముఠాతో అభివర్ణించిన చంద్రబాబు… కొందరివాడిగా ఉండనని, అందరివాడిగా ఉంటానని స్పష్టం చేశారు. 175 స్థానాల్లో తననే అభ్యర్థిగా భావించి…తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం కృష్ణాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆదివారం గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఆయన ఫోకస్‌ పెట్టారు. దాదాపు 4 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్‌స్విప్‌ చేసింది. మళ్లీ అన్ని సీట్లు గెల్చుకునేలా చంద్రబాబు వ్యూహం రచించారు. అందులో భాగంగానే గోదారి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్‌…సుప్రీంకోర్టులో కేసులు వేశాడన్నారు.

నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్ట్‌లను తన గుప్పిట్లో పెట్టుకొని….నీళ్లు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని  విమర్శించారు. పోలవరం నిర్మాణంతో  మునిగిపోతుందంటున్న భద్రాచలంను…తమకు ఇచ్చేయాలన్నారు. భద్రాచలంను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని చంద్రబాబు అన్నారు. తనకు కులం,మతం లేదని…తన కులం అభివృద్ధని, తన మతం సంక్షేమనన్నారు. కొందరివాడిగా ఉండనన్న ఆయన…అందరివాడుగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు.