పోలీస్ టీచర్…పేద పిల్లలకు పాఠాలు చెబుతున్న SI

కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక వెన్నలాంటి మనస్సు కలిగిన వాడు ఆ పోలీస్. పేదపిల్లలంటే జాలి. కేవలం వారిమీద జాలిపడి వదిలేయకుండా తన బిజీ బిజీ డ్యూటీ చేసుకుంటూనే 30మంది పేదపిల్లలకు పాఠాలు చెబుతున్నారు కర్ణాటక సబ్ ఇన్స్‌స్పెక్టర్ శాంతప్ప జడేమనవర్.
కరోనా మహమ్మారి వల్ల స్కూల్స్ ఓపెన్ కావటంలేదు. ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయి స్కూల్స్. ఆన్ లైన్ పాఠాలు వినాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. కానీ అందరికీ స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్తోమత ఉండదు. ముఖ్యంగా పనులు లేక అల్లాడిపోతున్న వలస కూలీల పిల్లలు నేటి చదువులను అందుకోలేకపోతున్నారు. అటువంటి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు కర్ణాటక రాజధాని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌లో సబ్ ఇన్స్‌స్పెక్టర్ శాంతప్ప జడేమనవర్.
ఆన్ లైన్ పాఠాలు వినలేని వారి పేదరికం చూసి చలించిపోయారు శాంతప్ప. తనవంతుగా ఏమన్నా చేయాలనుకున్నారు. దీంతో ఆయనే టీచర్ గా మారి ప్రతీరోజు డ్యూటీకి వెళ్లే ముందు కొంతసేపు వారికి చదువు చెబుతున్నారు. పోలీస్ అంటే మొదట్లో భయపడ్డ పిల్లలు చదువుకునేందుకు వచ్చేవారు కాదు. కానీ శాంతప్ప ప్రతీ ఇంటికి వెళ్లి చదువు చాలా అవసరం స్కూల్స్ తెరిచేవరకూ పాఠాలు నేర్చుకోవటం మంచిది అని నచ్చచెప్పటంతో పిల్లలంతా శాంతప్ప చెప్పే పాఠాలు వినటానికి వస్తున్నారు.
https://10tv.in/wanted-to-marry-minor-miscreant-opens-fire-outside-her-home/
ఈ సందర్భంగా శాంతప్ప మాట్లాడుతూ.. చదువుకునే హక్కు అందరికీ ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో పిల్లలు పాఠాలకు అందుకోలేకపోతున్నారు. దానికి కారణం పేదరికం. పేదరికంతో పిల్లలు చదువులకు దూరం కావటం చాలా బాధాకరం.. ఆన్ లైన్ విద్యకు వారు దూరం కావడం వారి తప్పుకాదు.
తల్లిదండ్రులతోపాటు వారు కూడా కూలీ పనులకు వెళ్లితే కానీ కడుపు నిండని దుస్థితి..దీంతో నాకు చేతనైన సహాయం చేయాలని అనుకున్నారు. అందుకే ప్రతిరోజు ఆ పిల్లల కోసం కొంత సమయం కేటాయించి చదువు చెబుతున్నాను. ఇది కూడా నా బాధ్యత తప్ప మరొకటికాదని అన్నారు. వలస కూలీల పిల్లలకు చదువు చెప్పడం ఎంతో సంతృప్తినిస్తున్నది.’ అని అన్నారు.