ఇద్దరికి బీఫాంలు కూడా : బాపట్ల బరిలో ముగ్గురు జనసేన అభ్యర్థులు

నామినేషన్‌ల అంకం పూర్తయ్యింది. నేతలు ప్రచారాలను వేగం చేశారు. ఏపీలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో దిగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతుండగా.. జనసేన పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై తికమక పడుతున్నారు.
గుంటూరు జిల్లా బాపట్ల జనసేనలోనే ఈ గందరగోళం నెలకొంది. బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ తరుపున ముగ్గురు నేతలు నామినేషన్ వేయడంతో ఆ పార్టీ నేత ఎవరు అనేదానిపై ఎవరికీ స్పష్టమైన క్లారిటీ రావట్లేదు. మొదటగా పార్టీ నుంచి బీ-ఫారం అందుకున్న రైల్వే కాంట్రాక్టర్ పులుగు మధుసూదన్‌రెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, ఆయనపై ఆరోపణలు రావడంతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సన్నిహితుడు ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు టికెట్ ఇచ్చి మధుసూదన్‌రెడ్డి బీ-ఫారంను జనసేన రద్దు చేసింది. దీంతో సోమవారం లక్ష్మీనరసింహ నామినేషన్ వేశారు.
అయితే, పార్టీ నుంచి బీ-ఫారం లేకపోయినప్పటికీ తానే అభ్యర్థినంటూ ఆ పార్టీకి చెందిన మరో నేత బీకే నాయుడు కూడా ఇక్కడి నుంచి నామినేషన్ వేశారు. ఇలా ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నేతలు బరిలో ఉండడంతో జనసేన శ్రేణులు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాయి.