బెజవాడ సెంట్రల్ : ట్రయాంగిల్ ఫైట్

బెజవాడ సెంట్రల్…టీడీపీ తరపున గట్టిగా వాయిస్ వినిపించే బోండా ఉమామహేశ్వరరావును ఎదుర్కొంటున్నారు మల్లాది విష్ణు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను మళ్లీ విజయతీరాలకు చేరుస్తుందనే నమ్మకంతో బోండా ఉమా ఉండగా.. సెంటిమెంట్, సామాజికవర్గం ఓటర్లను నమ్ముకుని మల్లాది బరిలో దిగారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మల్లాది విష్ణుకు వైసీపీ టికెట్ ఇచ్చింది. జనసేన పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్ధి బాబూరావు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అంతా టీడీపీ, వైసీపీ మధ్యే ఉంది.
2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమా…వైసీపీ అభ్యర్ధి గౌతంరెడ్డిపై 27 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. విజయవాడ సెంట్రల్‌లో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేది కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు. ఆ రెండు వర్గాలు కీలకం. ఉమా కాపు సామాజికవర్గ నేత కాగా, విష్ణు బ్రాహ్మణ సామాజికవర్గ నేత. ఇప్పుడు ప్రచారంలో కూడా నేతలు ఈ కులాల ఆధారంగానే రాజకీయాలు నడుపుతున్నారు.
2014 ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం టీడీపీ వైపే మొగ్గుచూపింది. అయితే ఈసారి వైసీపీ మల్లాది విష్ణుకు సీటు ఇవ్వడంతో వారు అటువైపు మళ్లుతారన్న అంచనా ఉంది. దీంతో బీసీలు, ఎస్సీలు ఎవరికి మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారు ఎవరికి మద్దతిస్తే విజయం అటువైపు మొగ్గే అవకాశం ఉంది. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని బోండా ఉమ నమ్ముతున్నారు. సెంట్రల్‌లో పట్టున్న వంగవీటి రాధా టీడీపీలో చేరడం కలిసొచ్చే అంశం. అయితే దూకుడుగా వ్యవహరించడం, నగరంలో భూకబ్జాలు చేశారనే ఆరోపణలు రావడం మైనస్ అయ్యే అవకాశం ఉంది.
వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మల్లాది విష్ణుకి నియోజకవర్గంపై మంచి పట్టుంది. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండటం…వైసీపీకి బలం పెరగటం విష్ణుకి కలిసొచ్చే అంశాలు. కానీ మొన్నటివరకు వైసీపీలో ఉన్న రాధా టీడీపీలో చేరడం విష్ణుకి కొంత ఇబ్బందనే చెప్పాలి.
జనసేన పొత్తులో భాగంగా సీపీఎం పోటీ చేస్తుంది. ఆ పార్టీ అభ్యర్ధి బాబురావుకి నియోజకవర్గంపై కొంత పట్టుంది. పవన్ అభిమానుల మద్ధతు కూడా కొంత ఉండొచ్చు. అయితే బాబూరావు ఎవరి ఓట్లు చీలుస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు సెంట్రల్‌లో బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో టఫ్ ఫైట్ నెలకొంది. వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.