తీరంలో అలజడి : శ్రీలంక పేలుళ్లు.. ఏపీలో హైఅలర్ట్

శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో.. రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తీరంలోని 9 జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఆస్పత్రులు వంటి ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, పోలీస్ డాగ్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో బాంబ్ స్వాడ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. భద్రతా చర్యల్లో భాగంగానే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని ప్రమాదమేమీ లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
శ్రీలంక పేలుళ్ల ఘటనతో తమిళనాడులో ఉంటున్న శ్రీలంక శరణార్థులు భయాందోళనలకు గురయ్యారు. స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్న వారంతా ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల అనంతరం వెళ్లేందుకు భయపడుతున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 107 శరణార్థ శిబిరాల్లో 61 వేల మంది శ్రీలంక శరణార్థులున్నారు. వీరంతా ఈలం యుద్ధ సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు తమిళనాడు వచ్చారు.
చేపల వేటపై ఎక్కువగా ఆధారపడే వీరు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వెళాలని ఆశపడ్డారు. ఈ పేలుళ్లతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయని శరణార్థుల పునరావాస సంస్థ వ్యవస్థాపకుడు తందైసెల్వ కుమారుడు ఎస్‌సీ చంద్రహాసన్ తెలిపారు.