నాటుబాంబు పేలి ఆవు మృతి 

  • Published By: chvmurthy ,Published On : September 1, 2019 / 10:14 AM IST
నాటుబాంబు పేలి ఆవు మృతి 

Updated On : September 1, 2019 / 10:14 AM IST

చిత్తూరు జిల్లాలో నాటుబాంబు పేలి ఆవు మృతి చెందింది. సత్యవేడు మండలం వీఆర్‌కండ్రిగ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.  వీఆర్‌కండ్రిగ గ్రామం సమీపంలోని ఒక మామిడి తోటలో మేతకు వెళ్ళిన ఒక ఆవు నాటుబాంబును గడ్డిగా భావించి తినాలని ప్రయత్నించింది. దీంతో నాటు బాంబు ఒక్కసారిగా పేలింది.  పేలుడు ధాటికి  ఆవు నోటి దవడలు చీలి తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది.

సమాచారం  తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అడవి పందులను వేటాడేందుకు ఎవరో నాటుబాంబులను పెట్టిఉంటారని  అనుమానించి కేసు నమోదు చేశారు. కాగా …ఆ మామిడి తోటలో మరికొన్ని బాంబులు ఉన్నాయని గ్రామంలో పుకార్లు వ్యాపించడంతో అప్రమత్తమయిన పోలీసులు చిత్తూరు నుంచి బాంబుస్క్వాడ్‌ను పిలిపించారు. బాంబ్ స్క్వాడ్ మామిడితోట మొత్తం జాగిలాలతో అణువణువు గాలించారు. బాంబులు ఏవీ లభ్యం కాలేదు.  

బాంబుల తయారీకు ఉపయోగించిన నూలు దారాలు, ప్లాస్టిక్‌ కవర్లు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తోటలో బాంబులను అమర్చిన వేటగాళ్ళు శుక్రవారం రాత్రే బాంబులను తీసేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.