చంద్రబాబు దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది

విజయవాడ : చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీకి నష్టం జరుగుతుందని వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. చంద్రబాబు తీరుపై రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రం అన్ని రంగాలలో నష్టపోతుందని హెచ్చరించారు. ప్రజలపై పన్నులు విధించకుండా చంద్రబాబు ఎప్పుడూ పరిపాలించలేదన్నారు. స్వలాభం దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పథకాలను రూపొందిస్తారని విమర్శించారు. బీజేపీకి టీడీపీ దూరమైంది ప్రజల ప్రయోజనం కోసం కాదని వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అని రామచంద్రయ్య అన్నారు. నియోజకవర్గాల డి-లిమిటేషన్ కు అంగీకరించలేదనే బీజేపీ తో బంధం కట్ చేసుకున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత లేకుండా ఏపీ ప్రయోజనాలు ఎలా సాధిస్తారని రామచంద్రయ్య ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీ చెయ్యడం లేదని రామచంద్రయ్య అడిగారు. హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో సెక్యూరిటీ వాళ్లు తప్ప ఎవరూ లేరని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైనా రామచంద్రయ్య విమర్శలు చేశారు. అధికార పక్షాన్ని(టీడీపీ) వదిలేసి ప్రతిపక్షాన్ని(వైసీపీ) మాత్రమే టార్గెట్ చేస్తున్న పవన్ ను చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారని విమర్శించారు. టీడీపీని వదిలి కేవలం వైసీపీని మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని రామచంద్రయ్య ప్రశ్నించారు. ప్యాకేజీలనేవి పవన్ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పారు. పవన్ తీరుతో ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
చంద్రబాబు రౌడీయిజాన్ని నమ్ముకుంటున్నారని రామచంద్రయ్య విమర్శించారు. వైఎస్‌ఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారని తెలిపారు. చంద్రబాబు రూపొందించే పథకాలన్నీ తనకు ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది అనే భావనతోనే ఉంటాయని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.