రాష్ట్ర సరిహద్దులు చెరపొద్దు: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

  • Published By: vamsi ,Published On : February 4, 2020 / 01:31 AM IST
రాష్ట్ర సరిహద్దులు చెరపొద్దు: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

Updated On : February 4, 2020 / 1:31 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దులు మార్చొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర హోం శాఖ పరిధిలోని జనాభా లెక్కల డైరెక్టరేట్‌. త్వరలో 2021 జనాభా లెక్కల గణన జరగనుందని, అది పూర్తయ్యే వరకు పరిపాలనా విభాగాల(అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్స్‌) సరిహద్దులను మార్చవద్దని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండలం, గ్రామాలు.. పరిపాలనా విభాగాల కిందకే వస్తాయని, జనాభా లెక్కలు పూర్తయ్యేవరకు.. అంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు సరిహద్దులు మార్చే కార్యక్రమం చేపట్టకూడదు. 

కేంద్రం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం..  రాష్ట్రప్రభుత్వం ఇప్పట్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. అలాగే రెవెన్యూ డివిజన్‌, మండలాలు, గ్రామాల వారీగా విభజన చేపట్టకూడదు. జనాభాలెక్కలు ముగిసేవరకు ఇప్పుడున్న యథాతథ స్థితినే కొనసాగించాలి. ఈ ఏడాది ఏప్రిల్‌, సెప్టెంబరు మాసాల్లో ఇంటింటి గణన, ఇళ్ల లెక్కల గణన, జనాభా రిజిస్టర్‌ అప్‌డేట్ చెయ్యడం వంటివి ఉంటాయి.

ఫిబ్రవరి 9 నుంచి జనాభా లెక్కల కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు రివిజన్‌ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది మార్చి 31 దాకా పాలనా యూనిట్ల విషయంలో యథాతథ స్థితినే కొనసాగించాలని డైరెక్టర్‌ స్పష్టం చేశారు. దీంతో ఈ అంశాన్ని రెవెన్యూ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.