జగన్ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు : ఈసీపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని లేఖలో మండిపడ్డారు.

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని లేఖలో మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని లేఖలో మండిపడ్డారు. ఐటీ దాడులతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ వెంటనే స్పందిస్తోందని చంద్రబాబు అన్నారు. 31 కేసులున్న జగన్ చేసే నిరాధారణ ఆరోపణలకు ఎన్నికల సంఘం ప్రాధాన్యమిస్తోందని చంద్రబాబు చెప్పారు.
ఈసీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, తమిళనాడులో ఆరోపణలు వచ్చినా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు చెప్పారు. నిజానిజాలు నిర్దారించుకోకుండా ఈసీ చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు సీరియస్ అయ్యారు.
Read Also : ఎన్నికల్లో..మద్యం,మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్
ఏపీలో పలు జిల్లాలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు, మద్దతుదారుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. రీసెంట్ గా ఎంపీ గల్లా జయదేవ్ ఆడిటర్ గుర్రప్పనాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం(ఏప్రిల్ 9) మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేశారు. జయదేవ్ ఎన్నికల ఖర్చుల వివరాలను ఆడిటర్ గుర్రప్పనాయుడు ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయినా సోదాలు నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
దీనికి తోడు ఏపీలో అధికారులు, సీఐల బదిలీలు హాట్ టాపిక్ గా మారాయి. కీలక స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేసింది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును, చీఫ్ సెక్రటరీ పునేఠను బదిలీ చేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్, మంగళగిరి, తాడేపల్లి సీఐలపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది.
ఓవైపు అధికారుల బదిలీలు, మరోవైపు ఐటీ సోదాలు.. ఏపీలో కలకలం రేపాయి. వీటిపై సీఎం బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, ఈసీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే అధికారులను బదిలీ చేస్తున్నారని, ఐటీ సోదాలు జరిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు