గుంటూరు అత్యాచార బాధితురాలికి చంద్రబాబు సాయం

గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను, ఆమె కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వారిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. గుంటూరులో జరిగిన ఈ అవమానీయ ఘటన బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు చంద్రబాబు. చట్టాలు తేవడం ఎంతముఖ్యమో వాటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వానికి అంతే చిత్తశుద్ధి ఉండాలని అన్నారు.
బాలికపై అత్యాచారం జరిగితే బాధిత కుటుంబాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం తరపున ఎవ్వరు కూడా ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఇంతవరకు రాలేదని, నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించినపుడే అటువంటి ఆలోచన చేసేవారిలో భయం పుడుతుందని అన్నారు.
‘దిశ’ చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ చొరవ ఇప్పుడేమైందని సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడప కూడా దాటట్లేదని విమర్శించారు. అత్యాచార బాధితురాలిని చూస్తే గుండె తరుక్కుపోతోందని, ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి టీడీపీ తరఫున రూ.50వేలు ఆర్థికసాయం చేసిన చంద్రాబాబు బాధితురాలికి అండగా ఉంటామని ప్రకటించారు.
బాధితురాలి పేరిట రూ.25 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, ఉన్నత చదువు పూర్తయ్యేవరకు ప్రభుత్వమే ఆ ఖర్చులు భరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటిస్థలం కేటాయించాలని అన్నారు.