అన్నను కోల్పోయా.. విగ్రహం కట్టిస్తాం: శివప్రసాద్ మరణంపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ కు పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంది. ప్రతీ పార్టీలోనూ ఆయన అభిమానులు ఉన్నారని అనడంలో అతిశయోక్తి లేదు. పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవిస్తారు కూడా. శివప్రసాద్ మరణంతో చిత్తూరు జిల్లా రాజకీయ నాయకులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం పార్టీ శ్రేణులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తమ అభిమాన నేతను కడసారి చూసుకునేందుకు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివస్తున్నారు.
ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా వైసీపీ నేత, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా శివప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శివప్రసాద్ ప్రజల మనిషి అని.. తన అన్నను కోల్పోయానంటూ చెవిరెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. శివప్రసాద్ స్వగ్రామం పులిత్తివారిపల్లిలో త్వరలో శివప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా శివప్రసాద్ అందరితో కలిసిపోయే వ్యక్తని, మనస్సున్న మారాజు అని ప్రశింసించారు.