తాడిపత్రిలో హైఅలర్ట్ : టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తాడిపత్రి 243వ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలింగ్ బూత్ ను పరిశీలించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి తనయుడు ప్రయాణిస్తున్న వాహనంపై దుండగులు దాడి చేశారు. టీడీపీ వర్గీయులే దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అటు జేసీ, ఇటు పెద్దారెడ్డి ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. పోలీసులు దుకాణాలను మూసేయించారు. తాడిపత్రిలో హైఅలర్ట్ ప్రకటించారు.
తాడిపత్రిలో ఉదయం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో దాడి చేసుకోవడం జరుగుతోంది. తాడిపత్రి మండలం వీరాపురంలో ఒకరు మృతి చెందారు. మరో మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.