మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చూపించు : బాబుకి సీఎం జగన్ సవాల్

గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు తెరిచామా ? విక్రయించామా..మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చూపించు అంటూ..బాబుకి సీఎం జగన్ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలకు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు జగన్. పట్టపగలే బాబు అబద్ధాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు..మరి ఓ వ్యక్తి పట్టపగలు అబద్దాలు మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల బాధ కలిగినా..ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూస్తే..సంతృప్తి కలుగుతుందని అన్నారు సీఎం జగన్.
అక్టోబర్ 04వ తేదీ శనివారం ఏలూరుకు వచ్చారు సీఎం జగన్. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్న తమ ప్రభుత్వానికి మంచి పేరు ఎక్కడ వస్తుందో అన్న భయంతోనే.. చంద్రబాబు ఇలా విమర్శలు చేస్తున్నారన్నారు. అక్టోబర్ 02 గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారంటూ ప్రభుత్వంపై అభాండాలు వేశారని తెలిపారు. ఆ రోజున ఎక్కడైనా మందు షాపు తెరిచి ఉందా అని ప్రజలనుద్దేశించి అడిగారు సీఎం జగన్.
గాంధీ జయంతి రోజున ప్రభుత్వం మద్యం షాపులు రన్ చేస్తోందంటే..ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలంటూ బాబు కామెంట్స్ చేశారు. పోలీసుల రక్షణతో మద్యం షాపులు నిర్వహిస్తారా అంటూ ఆయన మండిపడ్డారు.