రాయలసీమ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి : అధికారులను ఆదేశించిన సీఎం జగన్

రాయలసీమ కరువు నివారణకు అవసరమైన ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సీఎం జగన్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27, 2020) ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనకచర్ల, వెలిగొండ, జీఎన్‌ఎస్‌ఎస్, నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి, అవుకు టన్నెల్, గండికోట టన్నెల్, పెన్నా, వంశధార పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందని, ప్రస్తుతం ప్రాజెక్టుల పనుల పురోగతిపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాధాన్యత క్రమంలో ముందుగా చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌లపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఏ ప్రాజెక్టుకు ఎంత నిర్మాణ వ్యయం అవుతుందనే వివరాలను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వివరాలు, పురోగతిపై సమీక్షించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు సైతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా, బనకచర్ల అనుసంధానంపై ప్రణాళిక వివరాలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వీలైనంత తక్కువ ఖర్చులో ఎక్కువ లబ్ధి పొందేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.