అర్హులందరికీ మంచి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు

అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 12:21 AM IST
అర్హులందరికీ మంచి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు

Updated On : January 25, 2020 / 12:21 AM IST

అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలన్నది బృహత్తర కార్యక్రమమని, దీనిని తంతుగా మార్చవద్దని సీఎం చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా నివాస స్థల పట్టాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై శుక్రవారం (జనవరి 24, 2020) ఆయన అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పట్టాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజాసాధికార సర్వే (పీఎస్‌ఎస్‌) ప్రామాణికం కాదని, గ్రామ సచివాలయ, క్షేత్ర స్థాయి సిబ్బంది సర్వేనే కొలబద్ద అని స్పష్టం చేశారు. అర్హులు ఎంత మంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. 

ఆవాస యోగ్యంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ 
పేదలకు నివాస స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం యజ్ఞంగా భావిస్తోందని, అందువల్ల ఏ ఒక్కరూ ఈ మహా క్రతువును తంతుగా భావించవద్దని సీఎం అన్నారు. అందువల్ల అన్ని విధాలా అనుకూలంగా, ఆవాస యోగ్యంగా ఉండే ప్రాంతాలను ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సూచించారు. ఈ ప్రాథమిక విషయాన్ని ఎవరూ మరచి పోవద్దన్నారు. ఉపయోగం లేని చోట నివాస స్థల పట్టాలు ఇవ్వడంలో అర్థముండదని చెప్పారు. పట్టాలు ఇస్తున్న స్థలాలు సంతృప్తి కలిగించేలా, ఆవాస యోగ్యంగా ఉండాలన్న అంశాలను అధికారులు స్థలాలను ఎంపిక చేసే సమయంలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. 

jagan

నివాస స్థలాల కోసం అసైన్డ్‌ భూములను తీసుకోవద్దు
సాధ్యమైనంత వరకు నివాస స్థలాల కోసం అసైన్డ్‌ భూములను తీసుకోవద్దు. వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి భూములను తీసుకోవాల్సి వస్తే.. అసైనీలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి. ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దు. ఈ విషయాన్ని అధికారులు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి.

1 నుంచి గ్రామాల్లో సీఎం పర్యటన 
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తాను గ్రామాల్లో పర్యటిస్తానని, ఈ సమయంలో ర్యాండమ్‌గా కొన్ని పల్లెలకు వెళ్లి పరిశీలిస్తానని సీఎం జగన్ తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు జరుగుతున్న తీరును స్వయంగా వాకబు చేసి తెలుసుకుంటానని, ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్లు తేలితే కచ్చితంగా అధికారులనే బాధ్యులను చేస్తానని చెప్పారు. ఇళ్ల పట్టాలు ఇవ్వగానే ఇళ్లు కట్టడానికి లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని, ఈ విషయంలో అధికారులు హడావుడిగా వ్యవహరించరాదన్నారు. ఈ మేరకు అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతే ప్లాటింగ్‌ చేయాలి 
ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హత నిబంధనలను గ్రామ సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు. జాబితాలో పేర్లు లేని అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇది అవసరమని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలకు లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతే ప్లాటింగ్‌ చేయాలని, లేకపోతే ఇందు కోసం వెచ్చించిన సొమ్ము వృధా అవుతుంది. ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన స్థలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీల్లో లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. పేదలకు కట్టించే ఇళ్ల డిజైన్‌ బాగుండాలి. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని, ఇంటి స్థలం లేని వారు ఇక ఉండరాదన్నారు. 

ap cm jagan

ప్రజలను సంతోష పరిచేలా కార్యక్రమాలు ఉండాలి 
అభ్యంతరకర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని, వారికి ఇళ్ల పట్టాలు ఎక్కడ ఇస్తున్నామో చెప్పాలని చెప్పారు. వారికి ఇళ్లు కట్టి అప్పగించిన తర్వాతే అభ్యంతరకర ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని కోరాలని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం అధికారులు గుర్తించిన స్థలాల వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, స్థానికుల అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. ప్రజలను సంతోష పరిచేలా మన కార్యక్రమాలు ఉండాలి. అందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టలేదన్నారు. ‘అమ్మఒడి’ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతిపెద్ద కార్యక్రమం ఇది… దీనిని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి అన్నారు.