సున్నా మార్కులకు ఉద్యోగాలుపై కలెక్టర్ క్లారిటీ

  • Published By: vamsi ,Published On : October 20, 2019 / 01:04 PM IST
సున్నా మార్కులకు ఉద్యోగాలుపై కలెక్టర్ క్లారిటీ

Updated On : October 20, 2019 / 1:04 PM IST

సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలంటూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారంటూ వార్తలు వచ్చిన క్రమంలో లేటెస్ట్‌గా కలెక్టర్ స్పందించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టుల్లో సున్నా మార్కులు వచ్చిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించాంటూ వచ్చిన వార్తలు అపోహలే అని ఆయన వెల్లడించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో మెరిట్‌ ర్యాంకులు, రోస్టరు ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రకారమే ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల భర్తీ జరుగుతుందని కలెక్టరు హరికిరణ్‌ ప్రకటించారు.

సున్నా మార్కులకు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వస్తున్నాయని కొందరు అభ్యర్థులు ఆయా కార్యాలయాల దగ్గర అధికారులను ప్రశ్నించడాన్ని ఉన్నతాధికారులు కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఉద్యోగాల నియామక సందర్భంగా ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఓసీలకు 40శాతం (60 మార్కులు) బీసీలకు 35 శాతం (52.5మా ర్కులు) ఎస్సీ ఎస్టీలకు, విభిన్న ప్రతిభావంతులకు, వికలాంగులకు 30 శాతం (45 మార్కులు)గా అర్హతగా నిర్ణయించామని అన్నారు.

మెరిట్‌ ర్యాంకులు రోస్టరు ఆధారంగా ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ జరిగిందని అన్నారు. అయితే కొన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ కాకపోవడం, సచివాలయ ఉద్యోగాల్లో అభ్యర్థులు రెండుమూడు పరీక్షలు రాయడం వల్ల వారు తక్కిన శాఖలకు వెళ్లడంతో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయని అన్నారు. ఈ ఖాళీల భర్తీ విషయమై నోటిఫికేషన్‌లోని పేరా 15.3 ప్రకారం ఎస్సీ ఎస్టీ పోస్టులను భర్తీ చేయవలసి ఉందని అన్నారు.

45 మార్కులకంటే కింద ఉన్న మార్కుల ఆధారంగా మెరిట్‌ రిజర్వేషన్‌ ర్యాంకుల ఆధారంగా వీరి భర్తీ జరుగుతుందని, సున్నా మార్కులకు భర్తీ జరుగుతుందనేది అపోహ అన్నారు. సున్నా మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులు భావించవద్దని, అలాంటి ఎంపికలు ఉండవని స్పష్టం చేశారు.